మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోగులకు ఆహారం పంపిణీలో తీవ్ర లోపాలు: పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ రమణరాజు

12 గంటల క్రితం

రోగులకు ఆహారం పంపిణీలో తీవ్ర లోపాలు
పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ రమణరాజు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ

​కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అంతర్గత రోగులకు ఆహారం పంపిణీలో తీవ్ర లోపాలు చోటు చేసుకుంటున్నాయని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యులు, డైటీషియన్లు రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రత్యేక డైట్‌ షీట్లను సూచిస్తున్నప్పటికీ, కాంట్రాక్ట్‌ సిబ్బంది వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఒక రోగికి ఇవ్వాల్సిన ఆహారాన్ని మరొకరికి అందించడం, వైద్యుల సూచనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రోగుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.

ఉదయం తేలికపాటి ఆహారం అవసరమైన వారికి నాణ్యమైన పాలు, బ్రెడ్‌ అందించాల్సి ఉండగా నాణ్యత లేని బ్రెడ్‌, పలుచటి పాలు ఇస్తున్నారని ఆరోపించారు. మధుమేహ రోగులకు పంచదార లేని, తక్కువ పిండిపదార్థాలతో కూడిన ప్రత్యేక ఆహారం ఇవ్వాల్సి ఉన్నా సాధారణ భోజనమే అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్‌ అనంతరం, తీవ్ర బలహీనతతో ఉన్న రోగులకు అధిక ప్రొటీన్లు కలిగిన పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు అందించాల్సి ఉన్నప్పటికీ సక్రమంగా అందడం లేదని తెలిపారు. క్షయ రోగులకు అవసరమైన పోషకాహారం, మాంసాహారం మెనూ ప్రకారం పంపిణీ చేయడం లేదని తెలిపారు. సాధారణ రోగులదీ అదే పరిస్థితి అని అన్నారు. డైట్‌ కాంట్రాక్టర్ల పనితీరుపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌, కలెక్టర్‌ స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రమణరాజు డిమాండ్‌ చేశారు. వార్డుల వారీగా రోగుల డైట్‌ ఛార్ట్ లను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే ప్రభుత్వాసుపత్రి సేవలపై ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని రమణ రాజు పేర్కొన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్