ప్రజాశక్తి-కాకినాడ
కాకినాడ వివేకానంద పార్క్ మెయిన్ గేటు వద్ద భగత్ సింగ్, మహాకవి గుర్రం జాషువాల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు ప్రజాసంఘాల నాయకులు పూలమాలేసి, నివాళులర్పించారు. భగత్ సింగ్ చిత్రపటానికి
యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర వర్మ, రిటైర్డ్ పంచాయతీ అధికారి జొన్నాడ వెంకటేశ్వరరావు, జాషువా చిత్రపటానికి పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు, రిటైర్డ్ ఇఒపిఆర్ అండ్ ఆర్.డి. భాస్కరరావు పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర వర్మ మాట్లాడుతూ 1907 లో జన్మించిన భగత్ సింగ్ ను రాజ్ గురు, సుఖదేవ్ లతో కలిసి కసాయి బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఉరితీసిందన్నారు. క్షమాభిక్ష పిటిషన్ వేసిన తండ్రిని కూడా భగత్ సింగ్ మందలించారని తెలిపారు. సోషలిస్టు వ్యవస్థ గురించి అధ్యయనం చేసిన భగత్ సింగ్ మనదేశంలో స్వాతంత్ర్య సాధిస్తే సోషలిస్టు మార్గం అనుసరించాలని ఆకాంక్షించారన్నారు. గుర్రం జాషువా అంటరానితనంపై తన కలాన్ని దూశారని తెలిపారు. ఆయన రచన గబ్బిలం చాలా ప్రాచుర్యం పొందిందన్నారు. పద్మ భూషణ్ సహా అనేక బిరుదులు, సత్కారాలు అందుకున్నారని కొనియాడారు. చుదువు రాని వారు కూడా జాషువా పద్యాలు పాడుకుంటారని తెలిపారు.
సిఐటియు నగర కో-కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ ప్రజలంతా ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ళ పద్మ, నాగాబత్తుల సూర్యనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.సత్యం, యుటిఎఫ్ నాయకులు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)