శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్‌ కల్యాణ్‌ రాక

1 గంట క్రితం

సిఐఐ ప్రాంతీయ సదస్సుకు పవన్‌ కల్యాణ్‌ రాక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ

​కాకినాడ జెఎన్టియుకెలో ఈ నెల 12న నిర్వహించనున్న భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ప్రాంతీయ సదస్సుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి చివరి దశ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సదస్సు ఏర్పాట్లపై శనివారం కాకినాడ జెఎన్టియుకె అలూమ్ని ఆడిటోరియంలో జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌తో కలిసి కలెక్టర్‌ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ సమన్వయంతో ప్రవేశ నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సదస్సు ప్రతినిధులు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. సదస్సును వీక్షించేందుకు, ప్రదర్శన శాలను సందర్శించేందుకు వచ్చే సాధారణ ప్రజలను మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. భోజన విరామం ముగిసి, ముఖ్య అతిథులు వెళ్లిన అనంతరం సాధారణ ప్రజలను సీటింగ్‌ ప్రాంతానికి, ప్రదర్శనశాలకు అనుమతించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల రాక సందర్భంగా ప్రత్యేక ప్రొటోకాల్‌ పాటించాలని, హెలిప్యాడ్‌ వద్దకు చేరుకునే విఐసిల కోసం ప్రత్యేక రవాణా, వసతి సౌకర్యాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న అధికారులు, సిబ్బందిని నియమించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్‌కు నిర్దిష్ట ప్రాంతాలను కేటాయించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సందర్శకులకు మార్గనిర్దేశం చేసేందుకు అవసరమైన చోట్ల సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, హెల్ప్‌డెస్క్‌లు, రిఫ్రెష్‌మెంట్‌, భోజన ఏర్పాట్ల విషయంలో సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎఎస్పి ఎం.కిషోర్‌ కుమార్‌, ఆర్డిఒ ఎస్‌.మల్లిబాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్