శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర బృందం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

1 గంట క్రితం

కేంద్ర బృందం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-కాకినాడ

​కాకినాడ జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో ముఖ్యంగా ప్రాథమిక రంగాలకు సంబంధించి జరిగిన నష్టాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు శనివారం రాత్రికి కేంద్ర బృందం కాకినాడ జిల్లాకు చేరుకోనుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అమరావతి నుంచి తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర బృందం పర్యటన వివరాలను తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, నవంబర్ 1వ తేదీ ఉదయం నలుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి, తుపాను కారణంగా నష్టపోయిన ప్రాథమిక రంగాలకు సంబంధించిన వివిధ విభాగాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనుందని తెలిపారు. ఈ పర్యటనలోవ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య, పట్టు పరిశ్రమ రంగాలకు సంబంధించి జరిగిన పంటలు, ఆస్తుల నష్టాలను తీరప్రాంత రోడ్లను కేంద్ర బృందం పరిశీలించనుందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో ముంపునకు గురైన ప్రాంతాలు, పంటలకు జరిగిన నష్టాలను అంచనా వేయడంతో పాటు, మత్స్య రంగానికి సంబంధించి దెబ్బతిన్న బోట్లు, ఇతర మత్స్య సంపదకు జరిగిన నష్టాలను కూడా పరిశీలించ నుందని వివరించారు. కేంద్ర బృందం కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ తీర ప్రాంతంలో పర్యటించనుందని, తిరుగు ప్రయాణంలో పెద్దాపురం, గొల్లప్రోలు, తాటిపర్తి తదితర ప్రాంతాల్లో తుపాను ప్రభావాన్ని పరిశీలించనుందని తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న సముద్ర తీర ప్రాంత రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను కూడా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుందని తెలిపారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపు, పనుల అంచనాలు, పరిపాలనా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే ఆమోదం పొందిన ఫైళ్లను వెంటనే సర్క్యులేట్ చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు తమ విభాగాలకు సంబంధించి జరిగిన నష్టాల వివరాలు, అంచనాలు, ఫొటోలు, సంబంధిత రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను కారణంగా జరిగిన నష్టాలను, క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులను కేంద్ర బృందానికి స్పష్టంగా వివరించి, సమగ్ర సమా చారాన్ని అందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి.తిప్పేనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విటి.రామారావు, జిల్లా ఉద్యానవన అధికారి సిరిల్, మత్స్య శాఖ అధికారి కృష్ణకుమార్, రహదారులు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్