శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనేదెలా.. తినేదెలా?

5 రోజుల క్రితం

కొనేదెలా.. తినేదెలా?
నిత్యావసర ధరలతో సామాన్యుడి కంట కన్నీరు
ఆరు నెలల్లో భారీగా పెరిగిన బియ్యం, పప్పులు, వంటనూనెల రేట్లు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 06:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నిత్యావసర ధరలతో సామాన్యుడి కంట కన్నీరు

  • ఆరు నెలల్లో భారీగా పెరిగిన బియ్యం, పప్పులు, వంటనూనెల రేట్లు

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సామాన్యుడి ఇంట్లో ఒకటే లెక్క.. "ఈ నెల బడ్జెట్ ఎలా గడవాలి?" ఒకవైపు రోజురోజుకూ చుక్కలను తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. మరోవైపు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న ఆదాయాలు! వెరసి పేద, మధ్యతరగతి కుటుంబాల బతుకు బండి భారంగా సాగుతోంది.

గది దాటని ఆదాయం.. గడప దాటిన ఖర్చు

రోజువారీ కూలి పనులు చేసుకునే శ్రామికులు, చిరువ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగుల ఇళ్లలో ఇప్పుడు పస్తులుండని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. నెలాఖరున చేతికందే అరకొర జీతంలో ఇంటి అద్దె, కరెంటు బిల్లులు, పిల్లల చదువులు, ఆస్పత్రి ఖర్చులు పోను మిగిలేది గోరంత. ఆ మిగిలిన డబ్బుతోనే నెలంతా ఇంటిల్లిపాది ఆకలి తీర్చుకోవాలి. గతంలో నెలకు రూ.3 వేలతో సరిపోయే సరుకులకు ఇప్పుడు అదనంగా మరో వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి రావడంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది.

ఆరు నెలల్లో మారిన వంటింటి లెక్కలు

గత ఆరు నెలల కాలంలో వంటింట్లోకి వచ్చే ప్రతీ వస్తువు ధర సామాన్యుడికి షాక్ ఇస్తోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2026 మే 20న కిలో రూ.43.24 ఉన్న బియ్యం, నవంబర్ 20 నాటికి ఏకంగా రూ.48.38కు చేరింది. రకం బట్టి కేజీ రూ.75ల వరకూ ధర ఉంది. సామాన్యుడికి ప్రొటీన్ అందించే కందిపప్పు కిలో రూ.136 దాటగా, శనగపప్పు రూ.85.02 నుంచి రూ.95.84కు ఎగబాకింది. మినపప్పు, పెసరపప్పు సైతం సెంచరీ దాటి సామాన్యుడికి అందనంత దూరంలో నిల్చున్నాయి. వంటనూనెల సంగతి సరేసరి. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.185.70 నుంచి రూ.191కి, సోయా నూనె రూ.159.89 నుంచి రూ.169.64కు పెరిగాయి. చివరికి ప్యాకెట్ ఉప్పు ధర కూడా రూ.21.68 నుంచి రూ.22.55కు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కిలోల స్థానంలో అరకిలోలు.. పావుకిలోలు!

ఒకప్పుడు నెలకు సరిపడా సరుకులను కిలోల లెక్కన తెచ్చుకునే కుటుంబాలు, నేడు కిరాణా కొట్టుకు వెళ్లాలంటేనే భయపడుతున్నాయి. ధరల సెగకు తట్టుకోలేక కిలో కొనేచోట అరకిలో, పావుకిలో చొప్పున కోత పెట్టుకుంటూ కొనుగోలు చేస్తున్నాయి. కూరగాయల మార్కెట్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి, బెండకాయ, చిక్కుడు, బీన్స్, క్యారెట్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఫలితంగా కూరగాయల వినియోగాన్ని తగ్గించుకుంటూ, పిల్లలకు కనీసం పౌష్టికాహారం కూడా అందించలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు.

ఏం తిని బతకాలి?

"ఆదాయాలు పెరగకుండా ధరలు మాత్రమే పెరిగితే మేము బతికేదెలా?" అని సామాన్య ప్రజలు పాలకులను ప్రశ్నిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన నిఘా పెట్టాలని కోరుతున్నారు. రైతు బజార్ల ద్వారా తక్కువ ధరలకు కూరగాయలు అందుబాటులో ఉంచడంతో పాటు, రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై పప్పులు, వంట నూనెలు సరఫరా చేసి ఆదుకోవాలని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్