రూ.6 లక్షలతో 3 బోర్లు వేసి 24 ఎకరాల దేవాదాయ భూమికి తీరిన సాగునీటి కష్టం
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని పెనికేరులో శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాలకు చెందిన 24 ఎకరాల భూమిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న సాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ భూములను వేలం ద్వారా దక్కించుకున్న కౌలు రైతులు దేవస్థానానికి కౌలు చెల్లిస్తూ సాగు చేస్తున్నారు. అయితే సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో పంటల సాగులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సాగు రైతులంతా కలిసి ఈ సమస్యను గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈదర చిన్నబాబు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యపై స్పందించిన ఆయన ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, కౌలు రైతులు, గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సాగుభూమికి శాశ్వతంగా నీటి సౌకర్యం కల్పించేందుకు మూడు బోర్లు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు చిన్నబాబు నేతృత్వంలో దేవస్థానాల అధికారుల సహకారంతో మూడు విద్యుత్ బోర్లను ఏర్పాటు చేశారు. బోర్ల ఏర్పాటుకు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చయిందని ఆలయాల ఈవో ఎం.ఎస్.ఆర్.కృష్ణ తెలిపారు. ఏర్పాటు చేసిన బోర్లను ఈదర చిన్నబాబు స్విచ్ ఆన్ చేసి బుధవారం ప్రారంభించారు. దీంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న కౌలు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. అలాగే బోర్ల మోటార్లకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు జొన్నాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడి శ్రీనివాస్‌రెడ్డి సహకారం అందించారు. రైతుల సాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఆర్థిక సహకారం అందించిన చిన్నబాబుకు, విద్యుత్ లైన్ ఏర్పాటుకు సహకరించిన తాడి శ్రీనివాస్‌రెడ్డికి సాలువాలు కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సాగునీటి సమస్యను దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పరిష్కారం చూపిన చిన్నబాబును రైతులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల శ్రీనివాస్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ చైర్మన్ కోన వేగ్రస్, సొసైటీ అధ్యక్షులు మేకా రాంబాబు, టిడిపి గ్రామ అధ్యక్షులు గొడవర్తి సూర్యభాస్కరరావు, నేతలు మనగల రమణ, గుడాల ప్రభాకర్, కొమ్ము నారాయుడు, గొడవర్తి వెంకన్న, గుత్తుల శ్రీకృష్ణ, కుడుపూడి కొండ, సలాది రాజు, కోన గోవిందు, దాసరి సందీప్, పలువురు నాయకులు, కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)