ప్రజాశక్తి – రామచంద్రపురం(కోనసీమ) : 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోటిపల్లిలోని పుష్కర ఘాట్‌ను ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ శనివారం పరిశీలించారు. పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోటిపల్లిలోని బస్టాండ్, స్నానఘట్టాలు, పోలీస్ ఔట్‌పోస్టులను ఆయన పరిశీలించారు. పుష్కరాల సమయంలో యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్షించినట్లు వివరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, రహదారి సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఆర్టీసీ, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు.
బస్టాండ్ల నుంచి ఎన్ని బస్సులు నడపాలి, రైల్వే స్టేషన్లకు వచ్చే రైళ్ల వివరాలు, వాటి ద్వారా చేరుకునే యాత్రికులను పుష్కర ఘాట్లకు తరలించే ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నట్లు చెప్పారు. భక్తుల భద్రత, రాకపోకల నిర్వహణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపడతామని ఐజీ పేర్కొన్నారు. జిల్లాలో ముమ్మిడివరంతో పాటు కోటిపల్లి సహా మరో ఆరు పుష్కర ఘాట్లను పరిశీలించినట్లు తెలిపారు. పుష్కరాలకు సంబంధించి ముందస్తు చర్యలపై దృష్టి సారించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)