ప్రజాశక్తి - ఆలమూరు : పండంటి బిడ్డలకు జన్మనివ్వబోతున్న ఆడపడుచులకు సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఆత్మీయతను పంచుతూ సామూహిక సీమంతాలు చేయడం మన కర్తవ్యం అని టీడీపీ గ్రామ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు అన్నారు. ప్రధాని మోడీ జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఏ.గజలక్ష్మి సూచనల మేరకు, ఐసీడీఎస్ సూపర్వైజర్ కె.వరలక్ష్మి దేవి ఆధ్వర్యంలో మండలంలోని మడికి శివారు నాగులపేట కేంద్రంలో అంగన్వాడీల అభినందన ఉత్సవం, గర్భిణుల సీమంతోత్సవాన్ని ఆయన ఆధ్వర్యంలో కూటమి నాయకుల సౌజన్యంతో బుధవారం ఘనంగా నిర్వహించారు. మడికిలో ఐదు అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గర్భిణులను ఆడపడుచులుగా భావించి, పండ్లు, చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలతో సత్కరించి ఆత్మీయంగా ఆశీర్వదించారు. దీంతో గర్భిణుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి.
ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ .. గర్భిణులు తీసుకునే పౌష్టికాహారంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని సూచించారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి, తల్లి ఆరోగ్యమే పునాదని, గర్భధారణ సమయంలో పౌష్టికాహార లోపాలు అధిగమించేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణపై తల్లులకు పలు సూచనలు చేశారు. గర్భధారణ దశ నుంచి ప్రసవం వరకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, టీకాలు, ఇతర సదుపాయాలను ప్రతి గర్భిణీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ప్రసవం అనంతరం పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి, అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేయించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆడపడుచులు ఎలాంటి అవసరం వచ్చినా తనను సొంత సోదరుల వలె భావించాలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా కూటమి నేతలు భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తిస్తూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమంలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో అంగన్వాడి సెక్టార్ లీడర్ మెర్సీ ఫ్లోరెన్స్, కూటమి నేతలు అడ్డాల రాజు, ఈదర రమేష్, పంపన అంజిబాబు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)