ప్రెస్ మీట్ లో రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్సై నరేష్.
ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని మడికి గ్రామ పంచాయతి పరిధిలో చిలకలపాడుకు చెందిన మింగి రమేష్(24)ది హత్యేనని రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, ఎస్‌ఐ నరేష్‌లు బుధవారం తెలిపారు. గత నెల 29 వ తేదీ అర్ధరాత్రి సమయములో కార్తికేయ నర్సరీలో మింగి రమేష్ మృతదేహాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
వివరాల ప్రకారం.. మడికి గ్రామానికి చెందిన మింగి రమేష్ (నర్సరీ కార్మికుడు)కు అదే ప్రాంతానికి చెందిన గంప దుర్గాప్రసాద్ భార్య గంప అనూషతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రమేష్ తరచూ అనూషతో ఫోన్‌లో మాట్లాడటం, ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి రావడాన్ని గమనించిన దుర్గాప్రసాద్ అతనిపై కోపం పెంచుకున్నాడని పేర్కొన్నారు. గత నెల 29న రాత్రి రమేష్ తన స్కూటీని అనూష అద్దెకు ఉంటున్న ఇంటి వెనుక ఉన్న కార్తికేయ నర్సరీలో పెట్టి ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుర్గాప్రసాద్ రమేష్ తిరిగి వచ్చే వరకు స్కూటీ వద్ద వేచి ఉన్నాడు. రాత్రి 1.15 గంటల సమయంలో రమేష్ అనూష ఇంటి నుంచి నర్సరీలోకి వచ్చి స్కూటీ తీసుకునే సమయంలో దుర్గాప్రసాద్ అతని మెడలో ఉన్న పూసల దండతో గొంతు నులిమి, తన వద్ద ఉన్న కత్తితో పొట్టలో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రమేష్ కిందపడిపోవడంతో అతని గుండెలపై కూర్చొని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పర్యవేక్షణలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్ సహకారంతో ఆధారాలు సేకరించి, పలువురిని విచారించిన అనంతరం తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన కేసును ఈ నెల 5న హత్య కేసుగా మార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు గంప దుర్గాప్రసాద్ (26)ను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు మడికిలో అరెస్టు చేసినట్లు సీఐ విద్యాసాగర్, ఎస్ఐ నరేష్ తెలిపారు. బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు చెప్పారు. కాగా, మృతుడు రమేష్, నిందితుడు దుర్గాప్రసాద్, అనూషతోపాటు మరికొందరి సెల్‌ఫోన్ కాల్ డేటాను పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరెవరైనా పాత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దర్యాప్తు వేగవంతంగా జరిపి ముద్దాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన కొత్తపేట డి.ఎస్.పి సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్.విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్, ఏఎస్ఐ డి.స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ కె.అమ్మిరాజు, కానిస్టేబుల్స్ పి.రాజు, ఏం హనుమంత్ రాము, సహకరించిన ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారని సిఐ విద్యాసాగర్, ఎస్ఐ నరేష్ తెలిపారు.








కామెంట్‌లు (0)