ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి దేవి, మండల అంగన్వాడీల అధ్యక్షులు సుశీల
ప్రజాశక్తి - ఆలమూరు : పిల్లల సుస్థిర భవిష్యత్తు కోసం అంగన్‌వాడీలు నిరంతరం చేస్తున్న సేవలు ఎనలేనివని ఐసిడిఎస్ సూపర్వైజర్ కె.వరలక్ష్మి దేవి, మండల అంగన్వాడీల అధ్యక్షులు యు.సుశీల కొనియాడారు. ప్రధాని మోడీ జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ.గజలక్ష్మి సూచనలు మేరకు మండలంలోని చెముడులంక వెల్నెస్ సెంటర్ అంగన్వాడి కేంద్రంలో వారి ఆధ్వర్యంలో అంగన్‌వాడీల అభినందన ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సెక్టార్ పరిధిలో చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాధాన్యం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పునాది పడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా వారంతా భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంగన్వాడి టీచర్ కె.సూర్య కుమారి, అంగన్వాడి హెల్పర్ ఆర్.భద్రావతి ల సేవలను గుర్తించి స్థానిక ఏరియా మహిళలు వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి మాధురి, ఏఎన్ఎం శాంతకుమారి, సెక్టార్ లీడర్ మెర్సి ఫ్లోరెన్స్, అంగన్వాడిలు సూర్య కుమారి, సత్యవతి, జ్యోతి, ఆశ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)