రాయలపేటలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
హంద్రీనీవా జలాలతో ఐదు పంచాయతీల చెరువులకు నీరు – రోడ్ల విస్తరణకు నిధుల కేటాయింపు
కర్నూలు : కూటమి అభ్యర్థుల విజయంతోనే గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని రాయలపేట గ్రామంలో ఆదివారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంచాయతీ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాయలపేట గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి కె. వెంకటరమణను మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాయలపేట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా హంద్రీనీవా జలాలను వినియోగించుకుని రాయలపేట పరిధిలోని ఐదు పంచాయతీలకు చెందిన చెరువులన్నింటినీ నీటితో నింపేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల రైతులకు సాగునీటి సమస్యలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా రాయలపేట గ్రామంలో రోడ్డు విస్తరణకు సంబంధించి భూములు కోల్పోయే వారికి నష్టపరిహారం అందించేందుకు అవసరమైన నిధులను సైతం తీసుకువచ్చినట్లు వివరించారు. విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, సాగునీటి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రాయలపేట ప్రజలకు అవసరమైన మిగిలిన అభివృద్ధి పనులను కూడా దశలవారీగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి సహకరించే కూటమి అభ్యర్థి కె. వెంకటరమణను మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం, నాయకుల సమన్వయం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)