బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జర్నలిస్టులపై దాడులు అనాగరికం !

1 గంట క్రితం

Attacks on journalists are barbaric!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:22 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం!

- విజయవాడ లెనిన్ సెంటర్‌లో పాత్రికేయుల భారీ నిరసన ప్రదర్శన


ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడమేనని స్పష్టం చేస్తూ, జర్నలిస్టుల రక్షణ కోసం తక్షణమే పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అణచివేత ధోరణులను నిరసిస్తూ విజయవాడలోని లెనిన్ సెంటర్లో బుధవారం జర్నలిస్ట్ ప్రతినిధులు మహా నిరసన కార్యక్రమం నిర్వహించారు. వివిధ జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు ఈ ఆందోళనలో పాల్గొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమనికి ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర నాయకులు వల్లభనేని సురేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్ మాట్లాడుతూ .... ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియా నాల్గవ స్థంభంగా ఉంటూ సమాజంలోని అన్యాయాలను ఎత్తిచూపుతోందని అన్నారు. మీడియా నిజాలను నిర్భయంగా బయటపెడుతుందనే భయంతోనే అధికారంలో ఉన్నవారు జర్నలిస్టులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ప్రెస్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి చిగురుపాటి సతీష్‌బాబు మాట్లాడుతూ ... ఏ ప్రభుత్వమైనా తన మొదటి దాడిని ప్రశ్నించే వ్యవస్థల మీదనే ఎక్కుపెడుతుందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ యాదవ్, ఏపీ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్ష‍ులు అన్నవరపు బ్రహ్మయ్య మాట్లాడుతూ ... పత్రికలపై దాడులు చేయడం ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమేనని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎజె జాతీయ సహాయ కార్యదర్శి ఓ శాంతి మాట్లాడుతూ ... ఢిల్లీలో జరిగిన దారుణాలను తీవ్రంగా ఖండించారు. దేశ రాజధానిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను, కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను ఢిల్లీ పోలీసులు రోడ్లపై ఈడ్చుకుంటూ బట్టలు లాగేస్తూ అత్యంత పాశవికంగా వ్యవహరించారని మండిపడ్డారు. నాలుగు రోజులుగా ఆందోళనలను కవర్ చేస్తున్న రఫీజా, షాహీన్ వంటి మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులు, భౌతిక దాడులు జరగడం అత్యంత హేయమైన చర్యని, దీనికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డైనప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా, వారికి ప్రమోషన్లు కల్పించడం సిగ్గుచేటన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ ... కేంద్ర హోంమంత్రిని, ఢిల్లీ ముఖ్యమంత్రిని ప్రశ్నలు అడిగినందుకే మహిళా జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం మీడియా ప్రశ్నించే హక్కును కాలరాయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ నాగేష్ మాట్లాడుతూ ... ఢిల్లీలో కేవలం రెండు మూడు రోజుల్లోనే 36 మంది జర్నలిస్టులు తీవ్ర గాయాలపాలయ్యారని, ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదని, ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి చేసిన దాడులని పేర్కొన్నారు. ప్రభుత్వాలను పొగిడేవారు ఎప్పటికీ నిజమైన జర్నలిస్టులు కాలేరని ఆయన స్పష్టం చేశారు. అలాగే దేశంలో 18 ఏళ్ళు దాటిన వారు రికార్డుల ప్రకారం 101 కోట్ల మంది ఉంటే, 13 కోట్ల ఓట్లు తొలగించిన తర్వాత 85 వేల కోట్ల ఓట్లు ఎలా ఉన్నాయో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ డబ్ల్యూజేఏ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ ... కేవలం ఢిల్లీలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఐ న్యూస్ ప్రతినిధులపై, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో ప్రజాశక్తి విలేకరులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులకు ఏపీబీజేఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ జర్నలిస్టుల సంక్ష‍ేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష‍ులు ఎవిఎస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ ... మీడియా రంగంలో ప్రస్తుతం పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని, ఈ సమస్యలను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. రాబోయే పది రోజుల్లో జర్నలిస్టులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి కుల, సంఘ భేదాలు లేకుండా జర్నలిస్టులందరూ ఏకమై ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్ష‍ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, ఎం.బి.నాథన్‌, ఎపిబిజెఎ ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి చైతన్య, నగర అధ్యక్షులు తాళ్లూరి అనిల్ కుమార్, ఫెడరేషన్‌ కృష్ణాజిల్లా ఉపాధ్యక్ష‍ులు బి.రవీంద్రనాథ్‌ఠాగూర్‌ సందేశాలు ఇచ్చిన వారిలో ఉన్నారు. ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
011


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్