మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్తంభించిన బ్యాంకింగ్ సేవలు - బ్యాంకర్ల నినాదాలతో దద్దరిల్లిన బెజవాడ

11 సెప్టెంబర్, 2026

Banking services stalled – Bezawada reverberated with the slogans of bankers.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 03:09 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

వారానికి 5 రోజుల పని విధానం కోసం ఉద్యోగుల సమ్మె...


ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌‌బియు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విజయవాడ ధర్నచౌక్‌లో శుక్రవారం యుఎఫ్‌బియు అద్వార్యంలో నిర్వహించిన ధర్నలో ప్రభుత్వ రంగ బ్యాంకు సిబ్బంది పెద్దఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందార్భంగా నేతలు మాట్లాడుతూ.. గతంలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం బ్యాంకుల్లో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ), బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించాయని యూనియన్ తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ పని వేళలను 40 నిమిషాల పాటు పెంచేందుకు కూడా యూనియన్లు సమ్మతించాయన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, నాబార్డ్, స్టాక్ మార్కెట్లతో పాటు ప్రైవేట్ కంపెనీలలో కూడా వారానికి 5 రోజుల పని విధానం అమలవుతోందని, బ్యాంకుల్లో కూడా దీనిని అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా, ఈ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోవడంపై యూనియన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని, సరైన పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత సాధించాలంటే ఈ 5 రోజుల పని విధానం అత్యంత అవసరమని పేర్కొన్నారు. దీనితో పాటు బ్యాంకుల్లో తగినంత మంది క్లరికల్, సబ్-స్టాఫ్ సిబ్బందిని నియమించడం, నూతన పెన్షన్ సర్వీస్ (ఎన్‌పిఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఒపిఎస్) పునరుద్ధరించడం, పెన్షన్ నవీకరణ, రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను బ్యాంకులు భరించడం వంటి పలు కీలక డిమాండ్లు కూడా ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని వెల్లడించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చీఫ్ లేబర్ కమిషనర్, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో 2026 సెప్టెంబర్ 8 మరియు 9 తేదీల్లో నిర్వహించిన రాజీ సమావేశాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ఈ చర్చల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొన్నప్పటికీ, 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదని వివరించారు. ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాల మొండి వైఖరి కారణంగానే తాము ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని, ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలోని అన్ని బ్యాంకు శాఖలు మూసివేయబడతాయని, బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేతలు స్పష్టం చేశారు. జి. కాశీ విశ్వనాథ్ - జనరల్ సెక్రటరీ, ఎస్‌బిఊఒఎ, పి. అజయ్‌ ‌కుమార్ సిఐటియు రాష్ర్ట కార్యదర్శి, అజయ్ కుమార్ - జనరల్ సెక్రటరీ, బిఇఎఫ్‌ఐ (ఆంధ్రప్రదేశ్), ఎస్. వి. రమణ- అసిస్టెంట్ సెక్రటరీ, బిఇఎఫ్‌ఐ, వై. పి. ఎస్. మూర్తి - ప్రెసిడెంట్, ఐఆర్‌బిఎ, ఎమ్. వెంకటేష్, కొండల రావు, జి. అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు.


https://prajasakti.com/te-IN/districts/ntr/banking-services-stalled-bezawada-reverberated-with-the-slogans-of-bankers


జిల్లా వ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్ సేవలు...

బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, ఇతర పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌‌బియు) పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె ప్రభావం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా కనిపించింది. విజయవాడలోని ఎస్‌‌బిఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుండి సంఘం ప్రతినిధులు విడుదల చేసిన ప్రకటనతో పాటు జిల్లాలోని తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, గన్నవరం వంటి అన్ని ప్రధాన కేంద్రాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా మూతబడ్డాయి. ఈ సమ్మెకు తోడు తదుపరి రోజుల్లో రెండవ శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి పండుగ సెలవులు వరుసగా రావడంతో జిల్లాలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్రాంచ్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. అందువల్ల ఖాతాదారులు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ ఛానళ్లను ఉపయోగించుకోవాలని బ్యాంకర్ల కమిటీ సూచించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు, ఆపై అక్టోబర్ 26 నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని యూనియన్ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్