ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ప్రజాశక్తి - విస్సన్నపేట (ఎన్టిఆర్ జిల్లా) : మూడు రోజులు ఏలూరు జిల్లా జీలుగుమల్లిలో సంచరించి అనంతరం మంగళవారం చింతంపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పెద్ద పులి బుధవారం ఎన్టిఆర్ జిల్లా విసన్నపేట కొండపర్వ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు దానికి అమర్చిన ట్రాకర్ ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ కుమార్... అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బందితో కలిసి కొండపర్వ గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు, విద్యార్థులు, పశువుల భద్రత దృష్ట్యా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పులి సంచరించిన జాడలు, ఆనవాళ్లు గుర్తించి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామంలోని గురుకుల పాఠశాలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపళ్లతో ఆర్డిఒ మాట్లాడారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల ఆవరణ దాటి బయటకు వెళ్లకుండా చూడాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక తరగతులు (నైట్ క్లాసులు) నిర్వహించవద్దని స్పష్టం చేశారు. కొండపర్వతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మూడు రోజుల పాటు రైతులు పంట పొలాలకు వెళ్లవద్దని, పశువులు, గొర్రెలు, మేకలను మేత కోసం బయటకు వదలకుండా ఇళ్ల వద్దనే సురక్షితంగా కట్టి ఉంచాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్సన్నపేట తహశీల్దార్, ఎస్ఐ, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు.









కామెంట్లు (0)