ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ, వైజాగ్ ‌లలో ‘చిత్రామృతం’ లైవ్ కాన్సర్ట్

19 గంటల క్రితం

Chitramrutam live concert in Vijayawada and Vizag
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి : ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్.చిత్ర ఆంధ్రప్రదేశ్ సంగీత ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘ట్రెండ్‌సెట్టర్స్ లైవ్’ ఆధ్వర్యంలో, ‘ధ్వని’ ఈవెంట్ పార్ట్‌నర్‌గా ‘చిత్రామృతం’ పేరుతో రెండు భారీ లైవ్ కాన్సర్ట్‌లను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శనివారం విజయవాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర తో పాటు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా కె.ఎస్. చిత్ర మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్న అతి పెద్ద సంగీత వేడుకల్లో ఇదొకటని పేర్కొన్నారు. గతంలో విజయవాడలో పలువురు సంగీత దర్శకులతో కలిసి కచేరీలు చేసినప్పటికీ, తన సొంత ఆధ్వర్యంలో (డైరెక్ట్ కాన్సర్ట్) నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమం ఇదేనని ఆమె తెలిపారు. ఈ వేడుక కోసం తమ బృందం ఎంతో ఉత్సాహంతో సిద్ధమవుతోందని, సంగీత అభిమానులందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని ప్రోత్సహించి, ఆశీర్వదించాలని చిత్ర కోరారు. నిర్వాహకులు ట్రెండ్‌సెట్టర్స్ లైవ్ ప్రతినిధి సుధాకర్ మాట్లాడుతూ ... దాదాపు ఏడాది కాలం పాటు ప్రయత్నించిన తర్వాత చిత్రామృతానికి డేట్స్ లభించాయని తెలిపారు. ఆమె మధుర గాత్రాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే ఈ అరుదైన అవకాశాన్ని రాష్ట్రంలోని సంగీత ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చిత్ర తో కలిసి ఈ మొదటి కాన్సర్ట్ నిర్వహించడం ఎంతో అద్భుతంగా ఉందని ధ్వని ఈవెంట్ పార్ట్‌నర్ ప్రతినిధి లక్ష్మీ సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఈ కాన్సర్ట్‌లలో భాగంగా డిసెంబర్ 13 న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో, అలాగే డిసెంబర్ 20 న విశాఖపట్నం (వైజాగ్) లోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన టికెట్లు ‘బుక్ మై షో’ ద్వారా అందుబాటులో ఉంటాయని, మరిన్ని వివరాల కోసం 8801111125 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్