రెండవ రోజు ఆందోళన, మిల్క్ ఫ్యాక్టరీని ముట్టడించిన సిపిఎం
విజయ డైరీని ప్రైవేటు డైరీలకు కట్టబెట్టే కుట్రలు ఆపాలి...
పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి..
లేకుంటే ఉద్యమం ఉధృతం : సిపిఎం
విజయవాడ : నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో భారం మోపుతూ విజయ డైరీ పాల ధరలను పెంచడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. పెంచిన పాల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ (విజయ డైరీ) వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం, విజయ డైరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులు విజయ డైరీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రాంగణంలోకి చొచ్చుకు వచ్చి ముట్టడి చేపట్టారు. అనంతరం కార్యాలయం ఎదుట కూటమిపాలనలో ధరల పెరుగుదల తోపాటు విజయ డైయిరీ యాజమాన్య తీరు పై పాటల రూపంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ .... పాలు ప్రతి కుటుంబానికి నిత్యావసరమైన ఆహార మని, పాల ధరల పెంపు నేరుగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు నిత్యం పాలను వినియోగించాల్సి ఉంటుందని, అలాంటి నిత్యావసర వస్తువు ధరను పదేపదే పెంచడం ప్రజలపై భారం మోపడమేనని విమర్శించారు.విజయ డైయిరీ లాభాల్లో కొనసాగుతోందని చెబుతున్న యాజమాన్యం.. అభివృద్ధి, విస్తరణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ, మరోవైపు పాల ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. విజయ డైయిరీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను విస్మరించి ప్రైవేటు డైయిరీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం విజయ డైయిరీని అమూల్ సంస్థకు అప్పగించే ప్రయత్నం చేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హెరిటేజ్‌తో పాటు ఇతర ప్రైవేటు డైరీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందని నాయకులు విమర్శించారు. సహకార రంగంలో ఉన్న విజయ డైరీని పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు డైరీలకు మార్కెట్ విస్తరించేలా ప్రభుత్వ విధానాలు ఉండకూడదని స్పష్టం చేశారు. వినియోగదారులపై భారాలు మోపుతూ, మరో వైపు అప్రజాస్వామ్య పద్ధతి లో డెయిరీ పై ప్రభుత్వం పెత్తనం చేయడం తగదని నాయకులు అన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, డైయిరీ యాజమాన్యం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర తగ్గే వరకు పోరాటం ....
పాల ధరల పెంపును ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని సిపిఎం నాయకులు హెచ్చరించారు. మహిళా సంఘాలు, కార్మిక, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉమ్మడి పోరాటాన్ని నిర్మిస్తామని తెలిపారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి పాల ధరల పెంపుపై ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. వినాయక చవితి సందర్భంగా నగరంలోని పలు పందిళ్లను సందర్శించి నిర్వాహకులు, యాత్రికులు, ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పారు. అవసరమైన చోట్ల నిరసనలు, నిరాహార దీక్షలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెంచిన పాల ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు, భూపతి రమణ, సెంట్రల్ సిటీ కార్యదర్శి హెచ్చరించారు. ఈ ధర్నాలో ఐద్వా జిల్లా కార్యదర్శి సరోజ, పశ్చిమ అధ్యక్షురాలు వి. విజయలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి ప్రవీణ్, , సెంట్రల్ సిటీ నేత చింతల శ్రీనివాస్, తూర్పు సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బి. చిన్నారావు సిఐటియు తూర్పు కార్యదర్శి నాగేశ్వరరావు,నగర కార్యవర్గ సభ్యులు సూరిబాబు, సహా పశ్చిమ, సెంట్రల్, ఈస్ట్ సిటీనాయకులు,సీఐటీయూ,మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)