ఎల్‌ఓసీలను అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ప్రజాశక్తి- గొల్లపూడి : విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) పత్రాలను మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిస్తున్న సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి వేగంగా స్పందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లికి చెందిన మాలమంటి ఎస్తేరు రాణికి రూ.3,32,616లు, జి.కొండూరు మండలం చెరువుమాధవరం గ్రామానికి చెందిన పొన్నా ఏడుకొండలుకు రూ.2,69,304లు, కొత్తూరు తాడేపల్లి శివారు సీతారాంపురం తండాకు చెందిన కొర్రా వెంకట జగదీష్‌కు రూ.2,71,610లు, ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండకు చెందిన షైక్ జాఫర్‌కు రూ.75,833లు, విజయవాడ రూరల్ మండలం రాయనపాడుకు చెందిన శ్రీ హర్షకు రూ.1,05,945లు, కొత్తూరు తాడేపల్లికి చెందిన పోరల్ల సాంబశివరావుకు రూ.3,01,038, జక్కంపూడికి చెందిన పెనుమూడి గంగాధరరావుకు రూ.1,70,000లు విలువైన ఎల్‌ఓసీ పత్రాలను అందించారు. మొత్తం ఏడుగురు లబ్ధిదారులకు రూ.15,26,346లు విలువైన ఎల్‌ఓసీలను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రజల కష్టసమయాల్లో అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)