విస్సన్నపేట (ఎన్టిఆర్) : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల కేంద్రంలోని వికాస్ కాలేజీ సమీపంలో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వంతెన (బ్రిడ్జి) నిర్మాణం చేపట్టకపోవడం, స్పష్టమైన మార్జిన్‌లు లేకపోవడంతో వరుసగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.
తాజాగా శుక్రవారం వరంగల్ నుండి జంక్షన్ వైపు తౌడు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ, కాలేజీ సమీపానికి రాగానే రహదారి అంచనా దొరక్క అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. లారీ తీవ్రంగా దెబ్బతినగా, సరుకు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది.
అధికారుల నిర్లక్ష్యం – ఎవరికి వారే యమునా తీరే ...
ఇదే ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు లారీలు, ఇతర వాహనాలు బోల్తా పడి ప్రమాదాలకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దూరం నుంచి వచ్చే వాహన చోదకులకు రోడ్డు మార్జిన్ సరిగ్గా కనిపించకపోవడమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, ఈ రహదారి తమ పరిధిలోకి రాదంటూ ఆర్‌అండ్ బి , జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో ప్రాణం పోకముందే చర్యలు చేపట్టాలి ...
నిత్యం వందలాది వాహనాలు, కాలేజీ విద్యార్థులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి ఈ ప్రమాదకర ప్రాంతంలో అవసరమైన బ్రిడ్జి లేదా ప్రత్యామ్నాయ భద్రతా చర్యలు (సూచిక బోర్డులు, బారికేడ్లు) ఏర్పాటు చేయాలని, మరో అమాయకుడి ప్రాణం బలికాకముందే రహదారిని బాగుచేయాలని స్థానిక ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్‌లు (0)