శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికార కూటమి అక్రమాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 11 న రాష్ట్రవ్యాప్త నిరసన : సిపిఐ(యం)

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 02:41 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 11న రాష్ట్రవ్యాప్త నిరసన

సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల పిలుపు

ఎన్నికల్లో ప్రజల పాత్ర లేకుండా చేశారు

పోలీసులూ, టిడిపి గూండాలే ఎన్నికలు నిర్వహించారు


విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 11 వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టనున్నట్లు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, జి.ఈశ్వరయ్య ప్రకటించారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ఈ ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏమీ లేదని, పోలీసులు, టిడిపి గూండాల పాత్రే ఉందని, అటువంటప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను రానీయకుండా అభ్యర్థులను, ఏజెంట్లను భయపెట్టి నిర్బంధించి రిగ్గింగు చేసుకున్నారని, దీనికి 100 శాతం స్ట్రైక్‌ ‌రేట్‌ అని సిఎం చెప్పుడానికి సిగ్గుపడాలని అన్నారు. డబ్బు పంపకం, హెచ్చరికలు, పోలీసు కేసులు బెదిరింపులకు పాల్పడి పూర్తి అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుపుకున్నారని విమర్శించారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూ జరగని విధంగా సగం రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చేశారని తెలిపారు. యథేచ్ఛగా రిగ్గింగు చేశారని, అడ్డుకున్న వామపక్ష పార్టీల అభ్యర్థులను పోలీసులు వచ్చి కొట్టి నిర్బంధించారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు అంటే ఏజెంట్లను కొట్టడం, బెదిరించడం, రిగ్గింగు అని టిడిపి కొత్త నిర్వచనం చెబుతోందని అన్నారు. అనంతపురం, కర్నూలు నుండి శ్రీకాకుళం వరకూ రిగ్గింగు ప్రక్రియ జరిగిందని తెలిపారు. కర్నూలు జిల్లా ఉల్చాలలో సిపిఎం అభ్యర్థులపై పోలీసులే దాడులకు దిగారని అన్నారు. ప్రజలకు మంచి చేశామనే నమ్మకం ఉంటే అధికార పార్టీ రిగ్గింగుకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తోందని అయినా టిడిపి రిగ్గింగుకు పాల్పడిందంటే ప్రజలపై నమ్మకం కోల్పోయి భయపడుతోందని అర్థమవుతోందన్నారు. 2029లో ఇదే పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందని వివరించారు. ఒకవైపు ఓట్లు కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు ఉన్న ఓట్లు వేసుకోనీయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్న ఎన్నికల సంఘం ఏకపక్ష విధానాలతో ముఖ్యంగా యువత ఓట్లను తొలగిస్తోందని, కర్నాటకలో 24 లక్షల మంది యువత ఓట్లను తొలగించారని తెలిపారు. దేశంలో జెన్‌‌జీ యువత ముందుకు వస్తోందని, ప్రపంచంలో అమెరికాలోనూ ప్రభుత్వంలో మార్పులు వచ్చాయని, దాని ప్రభావం ఆయన అనుచరుడిగా ఉన్న మోడీపైనే పడుతుందని, అనంతరం రాష్ట్రంలోనూ జెన్‌‌జీ ప్రభావం ఉంటుందని, దీన్ని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యువతను చైతన్యం చేయడంతోపాటు ఎన్నికల అక్రమాలను ప్రజలకు వివరించేందుకు 11 వ ప్రజాస్వామ్య పరిరక్షణ దినం పేరుతో నిరసనలు చేపడతామని వెల్లడించారు. ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ .... రాష్ట్రంలో రెడ్‌‌బుక్‌ ‌పాలన నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గూండా రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరు అధ్వానంగా ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షపార్టీలు, వామపక్ష పార్టీల అభ్యర్థులనూ నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని అన్నారు. దేశంలో 13 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయారని ఆందోళన జరుగుతుంటే రాష్ట్రంలో ఓటు వేయనీయకుండా దాడులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరించిన దుర్మార్గ వైఖరిని నిరూపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, 11వ తేదీన జరిగే నిరసనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


కేసులతో ప్రారంభమై కేసులతో ముగిసే జీవితాలు ....

కమ్యూనిస్టుల జీవితాలు కేసులతో ప్రారంభమై కేసులతోనే ముగుస్తాయని, 11వ తేదీన నిరసన వ్యక్తం చేస్తే కేసులు పెడతామనే బెదిరింపులకు భయపడేవి కావని వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే పద్ధతిని ప్రభుత్వాలు అనుసరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వైనాట్‌ 175 అన్న జగన్‌‌మోహన్‌‌రెడ్డికి ఏమైందో చూశారని, 100 శాతం స్ట్రైక్‌ ‌రేట్‌ అన్న చంద్రబాబుకు కూడా అదేగతి పడుతుందని అన్నారు. అమెరికాలోనూ విర్రవీగిన ట్రంప్‌ ఓడిపోయారని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.


ఓటమి నుండి గుణపాఠాలు ....

స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థుల ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుని ప్రజా సమస్యలపై పోరాటంతో మరింత ముందుకు వెళతామే తప్ప కుంగిపోబోమని శ్రీనివాసరావు, ఈశ్వరయ్య పేర్కొన్నారు. విజయవాడ లాంటి నగరంలో ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రజల సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తున్నారని, మోడీకి వ్యతిరేకంగా నిలబడ్డారని, అందువల్లే మద్దతు ఇచ్చామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో కమ్యూనిస్టులకు ఎదురుగాలి ఉందని ప్రస్తుతం ప్రత్యామ్నాయ పరిస్థితులకు అనుకూలంగా ఉందని తెలిపారు.
01

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్