ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్, టిడ్కో ఇళ్ల పంపిణీకై జిల్లా కలెక్టరేట్ వద్ద పేదల భారీ ధర్నా
సెప్టెంబర్ 15 లోపు స్పందించకుంటే ఖాళీ ఇళ్ల ఆక్రమణ, గృహప్రవేశాలంటూ సి.పి.ఎం తీవ్ర హెచ్చరిక
ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్, టిడ్కో, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల తక్షణ పంపిణీ వంటి గృహనిర్మాణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం ఆధ్వర్యంలో పేదలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ ఐ.ఏ.ఎస్ కి సామూహిక అర్జీలు అందించి సమస్యలు తెలిపారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై, జిల్లా అధికార యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండున్నరేళ్లుగా పేదలకు ఇచ్చిన గృహ హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని నేతలు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు, పెద్ద కంపెనీలకు లక్షల ఎకరాల భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, పేదలకు 2, 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల భవనాలు వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పేదల ఇళ్ల నిర్మాణాలు మాత్రం ఐదేళ్లు, పదేళ్లుగా మొండి గోడలతో, ఖాళీ స్థలాలుగా పెండింగ్‌లో ఉండటం అన్యాయమన్నారు. నగరంలో సుమారు 6,700 ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయని, వీటిని అప్పగించకపోవడం వల్ల గత్యంతరం లేక అద్దెలు కట్టలేక ఒక్కో లబ్ధిదారుడు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు కేటాయిస్తామన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు పడావుగా పడి ఉండి, ప్రస్తుతం అవి గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వంటి అరాచక శక్తులకు ఆలవాలంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల కోసం యాభై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేసి పదేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దశాబ్దాలుగా కొండ ప్రాంతాల్లో, కృష్ణా కరకట్ట, రెవెన్యూ స్థలాల్లో నివసిస్తూ బి-ఫారాలు ఉన్న పేదలకు చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించి, సహకార బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భ్రమరాంపురంలోని 1,158 ఇళ్లకు మునుపటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ జీవో ఇచ్చినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై అవసరమైతే హైకోర్టులో పిల్ వేయిస్తామని స్పష్టం చేస్తూ, రాణీగారి తోట, వాంబే కాలనీ, రాజరాజేశ్వరి పేట ఇళ్లన్నింటికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమరావతి, విజయవాడలోని ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు ఇవ్వడం ఆపాలని, విజయవాడలోని 58 ఎకరాల డిస్నీల్యాండ్ స్థలం, రైల్వే, చెత్త ఫ్యాక్టరీ స్థలాలను పేదల ఇళ్ల స్థలాలుగా మార్చాలని కోరారు. 2025 నుంచి ప్రజలు పీజీఆర్‌ఎస్ ద్వారా వందలాది దరఖాస్తులు ఇస్తున్నా కనీసం రశీదులు ఇవ్వకుండా ప్రభుత్వం దొంగాట ఆడుతోందని మండిపడ్డారు. కృష్ణా కరకట్ట అవతల రిటైనింగ్ వాల్ లేకపోయినా పట్టాలిచ్చి, ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత కూడా ఎందుకు ఆపుతున్నారని అధికారులను నిలదీశారు.నేడు కలెక్టర్ ఇచ్చే హామీని బట్టే తదుపరి చర్యలు ఉంటాయని, పైపై మాటలు చెబితే వచ్చేసారి కలెక్టరేట్ కార్యాలయాన్ని వంటా వార్పుతో పూర్తిగా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్లు చేయాలని ఆఖరి గడువు విధించారు. ఆలోపు ప్రభుత్వం స్పందించకపోతే, కూలిపోయే స్థితిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఇళ్లలోకి లబ్ధిదారులతో తామే నేరుగా గృహప్రవేశాలు చేస్తామని, స్థలాలను, ఇళ్లను స్వయంగా ఆక్రమించుకుంటామని జిల్లా యంత్రాంగానికి, కూటమి ప్రభుత్వానికి నేతలు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.










కామెంట్‌లు (0)