ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా ఏకంగా రూ.96 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనట్లు వెల్లడించారు. శుక్రవారం కొండపల్లిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మౌలిక వసతులు లేకుండా పరిశ్రమలు రావని అందువల్ల పట్టణాలు, మున్సిపాలిటీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సుమారు రూ.32 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీకి అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) ద్వారా రూ.46 కోట్లు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద రూ.25 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు CAM కింద తాజాగా మరో రూ.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ నిధులతో కచ్చా డ్రైనేజీలను పక్కా డ్రైనేజీలుగా, కచ్చా రోడ్ల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, సెంటర్ డివైడర్లు, సెంటర్ డివైడర్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన ఇదే తరహాలో అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కొండపల్లికి మంజూరైన పనులను వేగంగా ప్రారంభించి, రాబోయే ఏడాది నుంచి రెండేళ్లలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.







కామెంట్‌లు (0)