శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశ్రమల పేరుతో మా భూములను లాక్కుంటే ఊరుకోం

3 రోజుల క్రితం

We will not tolerate it if our lands are snatched away in the name of industries.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 10:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సాగు భూములకు పట్టాలివ్వాలి

  • ఎపి రైతు, ఎపి కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు పది కిలోమీటర్లు పాదయాత్ర


ప్రజాశక్తి– ఎ.కొండూరు : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం రామచంద్రపురం, లక్ష్మీపురం, కోమటికుంట గ్రామాల పేద రైతులు 70 ఏళ్లుగా తమ సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఎపి రైతు, ఎపి కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని రామచంద్రపురం గ్రామం నుండి ఎ.కొండూరులోని తహశీల్దారు కార్యాలయం వరకు సుమారు పది కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. రైతులు ఆయా సంఘాల జెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి.ఆంజనేయులు మాట్లాడుతూ రామచంద్రపురం, లక్ష్మీపురం, కోమటికుంట గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్న సుమారు 350 ఎకరాల భూమిని ఇంతకాలం అటవీ భూమిగా పేర్కొంటూ రైతులపై కేసులు నమోదు చేసిన అధికారులు, ఇప్పుడు అదే భూమి రెవెన్యూ భూమిగా ఎలా మారిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. క్వాంటం వ్యాలీ డేటా సెంటర్ల పేరుతో ఈ భూములను స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలను విడనాడాలని డిమాండ్ చేశారు. రైతుల సాగు భూములను పరిశ్రమల పేరుతో పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలను సహించబోమన్నారు. ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా అధికారులు రెండు నెలల క్రితం శంకుస్థాపన చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని రైతులు ఐక్యంగా అడ్డుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ మాట్లాడుతూ సాగు నీరు అందిస్తే ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకోవాలని చూడడం రైతు వ్యతిరేక చర్యని అన్నారు. పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎపి రైతు సంఘం నాయకులు మర్రపు సూర్యనారాయణ మాట్లాడుతూ రైతులు ఐక్యంగా పోరాడితేనే భూములను కాపాడుకోగలరని తెలిపారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రైతుల ఐక్య ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు వెనక్కి తగ్గిన విషయాన్ని గుర్తు చేశారు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్