శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ సరస్ మేళా వేదికగా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు

3 గంటల క్రితం

స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు..
 జాతీయ సరస్ మేళా వేదికగా సాధికారతకు సరికొత్త ముందడుగు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సరస్ మేళాలో ఎస్‌హెచ్‌జి మహిళలకు ఎగుమతి మార్కెటింగ్‌పై శిక్షణ


ప్రజాశక్తి-విజయవాడ

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'దీన్‌దయాల్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్' కింద విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ 'సరస్ మేళా'లో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల కోసం శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఢిల్లీ శాఖ మార్కెటింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 'ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ఎగుమతి మార్కెటింగ్: సవాళ్లు - అవకాశాలు' అనే అంశంపై ఈ శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 90 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలు, 35 మంది రాష్ట్ర నోడల్ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగుమతి మార్కెటింగ్ నిపుణులు చింతలపూడి మల్లేశ్వరరావు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించి శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌జీ మహిళలు తాము ఎదుర్కొంటున్న మార్కెటింగ్ సవాళ్లను పంచుకోవడంతో పాటు అంతర్జాతీయ కొనుగోలుదారులను గుర్తించడం, దళారుల ప్రమేయాన్ని తగ్గించడం, నాణ్యతా ప్రమాణాలను కాపాడుకోవడంపై చర్చించారు. ప్రత్యేకించి ప్యాకేజింగ్, బ్రాండింగ్, రిజిస్ట్రేషన్లు, ధృవీకరణ పత్రాలు, ఎగుమతి డాక్యుమెంటేషన్, లాజిస్టిక్స్ వంటి కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. సేంద్రియ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, హస్తకళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అపారమైన అవకాశాలను ఈ వేదిక ద్వారా వివరించారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ట్రేడ్ ఫేర్లు, ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ల ద్వారా సామూహిక మార్కెటింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ చిరంజీ లాల్ కటారియా, రీసెర్చ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ సింగ్, ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ నేషనల్ మిషన్ మేనేజర్ రాజీవ్ సింఘాల్, ఏపీ సెర్ప్ డైరెక్టర్ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ ఏ.ఎన్‌.వి. నాంచారరావు తదితరులు పాల్గొని మార్గనిర్దేశం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్