ప్రజాశక్తి- విజయవాడ
స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.42 వేలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శాంతినగర్ ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెంట్రల్ సిటీ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై డిసెంబర్ 1, 2, 3 తేదీలలో నిర్వహించే 'చలో ఢిల్లీ' కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బడా కంపెనీలకు ఇస్తున్న రాయితీలను విరమించుకుని, కష్టపడి పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం కార్మిక నాయకులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.కె. షాహెన, ఇ. దుర్గాలక్ష్మి, నాయకులు విజయకుమారి, వనజ, సత్యవేణి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)