సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎండలతో పంటను కాపాడుకునేందుకు రైతు వినూత్న ప్రయత్నం

6 రోజుల క్రితం

crop
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 02:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బోరు వేసి...జనరేటర్‌తో నీరందిస్తూ...డ్రిప్‌ ద్వారా సాగు

  • ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా వెంకటేశ్వరరెడ్డి ఆలోచన...

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కొందరు రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నప్పటికీ, మరికొందరు వర్షాల కోసం ఎదురుచూస్తూ దుక్కులు కూడా దున్నని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామానికి చెందిన రైతు సుంకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి వినూత్న ఆలోచనతో పూలు, కూరగాయల సాగును కొనసాగిస్తున్నారు. వెంకటేశ్వరరెడ్డికి ఉన్న 1.40 సెంట్ల వ్యవసాయ భూమిలో బంతిపూలు, బెండ, బీర తదితర పంటలను సాగు చేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో వాటిని కాపాడుకునేందుకు పొలంలో రూ 1.10 లక్షలు వెచ్చించి బోరు వేయించారు. అయితే మోటారుకు సమీపంలో విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో జనరేటర్‌ ద్వారా మోటారును నడుపుతున్నారు. బోరు నీటిని డ్రిప్‌ పద్ధతిలో మొక్కలకు అందిస్తూ పంటను కాపాడుకుంటున్నారు. జనరేటర్‌ కోసం నెలకు సుమారు రూ 10 వేల అద్దె చెల్లిస్తుండగా, డీజిల్‌కు రోజుకు సుమారు రూ.500 వరకు ఖర్చవుతుందని రైతు తెలిపారు. అధిక వ్యయం అవుతున్నప్పటికీ పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సాగును కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కార్తీక మాసం నాటికి బంతిపూలకు మంచి డిమాండ్‌ ఉంటుందని, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా పూలు, కూరగాయల సాగు తక్కువ విస్తీర్ణంలో జరుగుతున్నందున దిగుబడికి మంచి ధర లభించే అవకాశం ఉందని వెంకటేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే పెట్టుబడి ఎక్కువైనా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వర్షం కోసం ఎదురుచూస్తూ పంటలను వదిలేయకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ డ్రిప్‌ సాగుతో పంటను కాపాడుకోవచ్చని వెంకటేశ్వరరెడ్డి ఆచరణలో చూపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పట్టుదలతో సాగును కొనసాగిస్తున్న ఆయన ఆలోచన, ప్రయత్నం ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

01

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్