- 1.865 టీఎంసీల నీటి కేటాయింపులు చేస్తూ ఏపీ జలవనరుల శాఖ జీఓ జారీ...
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించి పల్నాడు ప్రజల దాహార్తిని తీర్చాలని నిరంతరం శ్రమిస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆశయానికి, ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు నేడు ఒక గొప్ప విజయం లభించింది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి పల్నాడు గ్రామీణ తాగునీటి అవసరాల కోసం 1.865 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ జీవో విడుదల చేసింది. ఇది కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు... వేలాది కుటుంబాల భవిష్యత్తుకు ఇచ్చిన భరోసా. ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ జీవో నిదర్శనం. ఇప్పటి వరకు వేసవి కాలంలో లేదా అవసరమైన సందర్భాల్లో మాత్రమే కాలువల ద్వారా తాగునీటిని అందించే విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఇంటేక్ వ్యవస్థ ద్వారా నేరుగా తాగునీటిని సరఫరా చేసే అవకాశం కలుగుతుంది. దీంతో నీటి సరఫరా మరింత స్థిరంగా, సమర్థవంతంగా ఉండబోతుంది.ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను తగ్గించేందుకు బలమైన పునాది పడింది. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కోసం ఇబ్బందులు పడే ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో పల్నాడు ప్రాంతంతో పాటు ఈ పథకం పరిధిలోని గ్రామాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే తరాలకు కూడా ఉపయోగపడే అభివృద్ధి నిర్ణయంగా నిలుస్తుంది.







కామెంట్‌లు (0)