సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేపటి చలో విజయవాడకు అనుమతి లేదు : ఎస్పీ జగదీష్ ఆదహళ్లి

1 రోజు క్రితం

No permission granted for the 'Chalo Vijayawada' protest by Village/Ward Secretariat employees tomorrow: SP Jagadeesh Adahalli.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 02:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ధర్నాచౌక్‌ లో నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి మంజూరు కాలేదని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్ ఆదహళ్లి మాట్లాడుతూ .... అనుమతి లేని కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని సూచించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రతి ఉద్యోగి ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి హాజరు కావాలని ఐక్యవేదిక పిలుపునిచ్చినట్లు హాజరుకాని ఉద్యోగులకు రూ 5 వేల జరిమానా విధించేలా తీర్మానం చేసినట్లు ప్రచారం జరుగుతుందని తెలిపారు. అయితే ఇలాంటి ప్రచారాలను ఆధారంగా చేసుకుని ఉద్యోగులు ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. ఉద్యోగులను కార్యక్రమంలో పాల్గొనాలని బెదిరించడం, బలవంతం చేయడం, ప్రజాశాంతి, భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలతో పాటు వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. భారీ వర్షాలు, తుఫాను పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు విధులకు అందుబాటులో ఉండేలా సెలవులు, సాధారణ సెలవులను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారని అన్నారు. వర్షాలు, తుఫాను కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవడం, వర్షాల అనంతరం సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టడం, పారిశుధ్య నిర్వహణ, దోమల నివారణ మందుల పిచికారీ, మురుగు కాలువల శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ, తాగునీటి సరఫరా, అత్యవసర పౌర సేవలను నిరంతరం అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సంబంధిత ఉద్యోగులు తమ తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండి, అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్