నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పల్నాడు ఎస్‌పి
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్‌పి జగదీష్ ఆదహళ్లి నరసరావుపేట పట్టణంలోని ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద పోలీసు భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు విధులను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు, నరసరావుపేట వన్‌టౌన్ సీఐ ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)