ప్రజాశక్తి - మాచర్ల రూరల్
రోడ్డుపై వాహనాలు దూసుకెళ్తున్నాయి.. పక్కనే ఫుట్‌పాత్ ఉంది.. కానీ అక్కడ పాదచారులు మాత్రం నడవలేని పరిస్థితి.. ఫుట్‌పాత్ ల పై దుకాణాలు అడ్డుగా.. వాహనాల పార్కింగ్.. మరికొన్ని చోట్ల ఇళ్ల ముందు వేసిన దడులు.. ఫలితంగా పాదచారులకు దారి లేకుండా పోయింది. చేసేదిలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్డుపైనే నడవాల్సిన దుస్థితి మాచర్లలో నెలకొంది.
ఫుట్‌పాత్ కనిపించటం లేదు ..
ఇటీవల మాచర్ల పట్టణంలో రహదారులను విస్తరించి నాలుగు లైన్ల హైవేగా అభివృద్ధి చేశారు. పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు నిర్మించి, రక్షణ కోసం ఇనుప గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మారిపోయింది. చిన్నచిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆటోలు, కార్లు నిలిపేస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల యజమానులు పాదచారులు వెళ్లకుండా ఫుట్‌పాత్‌కు అడ్డంగా దడులు ఏర్పాటు చేసుకున్నారు. ఆలా ఫుట్‌పాత్ పూర్తిగా మూసుకుపోవటంతో పాదచారుల కోసం నిర్మించిన కాలిబాటలు కనిపించటం లేదు.
ప్రమాదకర పరిస్థితుల్లో నడక..
మాచర్ల నుంచి హైదరాబాద్, శ్రీశైలం, గుంటూరు వైపు వెళ్లే వాహనాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు సాగించే వాహనాలతో ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఇదే రహదారి వెంబడి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేవారు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వారిని తీసుకెళ్లే తల్లిదండ్రులు, ఆసుపత్రులకు వచ్చే రోగులు, వివిధ పనులపై వెళ్లే ప్రజలు.. ఇలా రోజూ వేలాది మంది ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. ఒకవైపు ఫుట్‌పాత్ ఆక్రమణలకు గురికావడం.. మరోవైపు ఫుట్‌పాత్ బయట రోడ్డుపైనే వాహనాలను నిలిపివేయడంతో పాదచారులు వేగంగా దూసుకెళ్లే వాహనాల మధ్య నడవాల్సి రావడంతో ప్రతి అడుగు ప్రమాదకరంగా మారుతోంది. గత ఆరు నెలల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు పది మంది వరకు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఫుట్‌పాత్ మొత్తం మూసుకుపోయింది.. విద్యార్థి వీరబ్రహ్మం
ఫుట్‌పాత్‌పై నడవడానికి వీలు లేకుండా ఉంది. మొత్తం ఆక్రమణలకు గురైంది. దాంతో రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. వాహనాలు వేగంగా వెళ్తుండటంతో భయంగా ఉంటుంది అని 9వ తరగతి విద్యార్థి వీరబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశాడు.
చిన్నారిని తీసుకుని రోడ్డుపై నడవాలంటే భయంగా ఉంది : విద్యార్థి తల్లి రాజేశ్వరి
ఫుట్‌పాత్ మొత్తం మూసుకుపోయింది. రోడ్డుపై వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. వాటిని తప్పించుకుంటూ పిల్లలను స్కూల్ కు తీసుకుపోవటం కష్టంగా ఉంది. ఎప్పుడు ఏ వాహనం ఢీకొంటుందోనని భయంగా ఉంటుందని ఒక చేతిలో చంటి పిల్లను చంకన ఎత్తుకుని.. భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని.. కుమారుడి చేయి పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ స్కూల్ వైపు వెళ్తున్న రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది.
‘నడిచే హక్కు’ కూడా ప్రాథమిక హక్కే.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ..
సురక్షితమైన వాతావరణంలో ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా నడవగలిగినప్పుడే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు అర్థం ఉంటుందని, సురక్షితంగా నడవడం పౌరుల ప్రాథమిక హక్కులో భాగమేనని ఈ ఏడాది జూన్‌లో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్‌కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఓ తండ్రి తన కుమారుడిని పాఠశాలకు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొనడంతో బాలుడు మృతి చెందిన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చక్రాలు కనిపెట్టకముందే మానవులు నడవడం ప్రారంభించారని, అందువల్ల నడిచే హక్కు అనేది చక్రాలపై ప్రయాణించే వాహనాల హక్కు కంటే ప్రాథమికమైనదని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(d) దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ లలో భాగంగానే ఈ "నడిచే హక్కు" కూడా అంతర్భాగమని కోర్టు స్పష్టం చేసింది. నగరాలు, గ్రామాల్లో రహదారులు నిర్మించే సమయంలో పాదచారుల కోసం ప్రత్యేక ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడం స్థానిక సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన విషయం కాదని, అది వారి బాధ్యత అని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్ నిర్మించి బాధ్యత పూర్తయిందని భావించకుండా.. వాటిపై ఆక్రమణలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలదేనని పేర్కొంది. సుప్రీంకోర్టు ‘నడిచే హక్కు’ గురించి ఇంత స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో మాచర్లలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేసి ఫుట్‌పాత్‌లు నిర్మించినా.. వాటిని పాదచారులకు అందుబాటులో ఉంచకపోతే ఆ నిర్మాణాల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది.
ఫిర్యాదు చేయవచ్చు.. . నష్టపరిహారం కోరవచ్చు..
ఫుట్‌పాత్‌ల దుస్థితి, ఆక్రమణలు, మరమ్మతులపై సంబంధిత మున్సిపాలిటీ లేదా స్థానిక సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఏపీ పీజిఆర్ఎస్ పోర్టల్‌లో మున్సిపాలిటీ లేదా ఆర్‌అండ్‌బీ శాఖను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేయొచ్చు. ఫోన్ ద్వారా 1100 లేదా 1902కు కాల్ చేసి సమస్యను తెలియజేసి, ఫిర్యాదు నంబర్‌ను భద్రపరచుకోవాలి. మున్సిపాలిటి, పంచాయతీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అలానే ఒకవేళ సరైన ఫుట్‌పాత్ లేకపోవడం వల్ల , ఆక్రమణల వల్ల పాదచారుల హక్కులకు భంగం కలిగినా లేదా ప్రమాదాలు జరిగినా, బాధ్యులైన స్థానిక అధికారుల నుండి పౌరులు రాజ్యాంగపరమైన నివారణలు, నష్టపరిహారం కోరవచ్చు.










కామెంట్‌లు (0)