ఫిన్లాండ్ విద్యా విధానాన్ని అధ్యయనం చేసిన 29 మంది ఏపీ ఉత్తమ ఉపాధ్యాయులు
ప్రజాశక్తి-జియ్యమ్మవలస (మన్యం) : ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ తమిళ్ అన్సారి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 29 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక అంతర్జాతీయ శిక్షణ (ఎక్స్‌పోజర్ విజిట్) నిర్వహించారు. ‘తుర్కు యూనివర్సిటీ’ (యూనివర్సిటీ అప్ తుర్కు) వైస్ ఛాన్సలర్ గౌరవార్థం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆగస్టు 17 నుండి 26 వరకు ఫిన్లాండ్‌లోని అత్యుత్తమ విద్యా సంస్థలను సందర్శించి అక్కడి బోధనా విధానాలపై సమగ్ర అధ్యయనం చేశారు. ఈ బృందంలో పార్వతీపురంమన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, పెడిబుడ్డి గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎర్ర శంకరరావు రాష్ట్రం నుండి ఎంపికై ఈ అంతర్జాతీయ విద్యా పరిశోధన,పర్యటనలో పాల్గొనడం విశేషం. ఫిన్లాండ్‌లోని రెండు ఈసీఈసీ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ స్కూల్స్, హయ్యర్ సెకండరీ గ్రేడ్ పాఠశాలలతో పాటు, తుర్కు లోని ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్, మౌరా లోని టీచర్స్ ట్రైనింగ్ సెంటర్‌లను ఉపాధ్యాయ బృందం పరిశీలించింది. ఫిన్లాండ్‌లో విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, పూర్తిగా 'విద్యార్థి కేంద్రీకృత' (స్టూడెంట్ - సెంట్రిక్ ), ఆట ఆధారిత (ప్లే - బేస్డ్ ),పరీక్షల భయం లేని విద్యా విధానం అమలవుతున్నట్లు వారు గుర్తించారు. విద్యార్థులు 'జాయ్‌ఫుల్ లెర్నింగ్' ద్వారా ఆనందంగా నేర్చుకుంటున్న తీరును పరిశీలించారు. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో లైఫ్ స్కిల్స్‌కు (లైఫ్ స్కిల్స్ ) అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి వారం విద్యార్థుల కోసం 'ఫారెస్ట్ వాక్' (ఫారెస్ట్ వాక్ ) పీరియడ్ నిర్వహించి ప్రకృతిని దగ్గరగా పరిచయం చేస్తున్నారు. యూనివర్సిటీ స్థాయి వరకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తుండగా, వృత్తి విద్యా కోర్సులకు (ఒకేషనల్ ట్రైనింగ్ ) ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు నిజాయితీ మరియు పరస్పర నమ్మకంపై ఆధారపడి పనిచేస్తున్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉంది. 8 నెలల నుండి 5 సంవత్సరాల వయసు పిల్లల సంరక్షణ కోసం ఈసీఈసీ కేంద్రాలలో అత్యంత ఆధునాతన రిసోర్సెస్ వాడుతున్నారు. అలాగే పాఠశాలల్లో అత్యాధునిక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు కేవలం ఒక 'ఫెసిలిటేటర్' (సహాయకుడు) లేదా పరిశీలకుడిగా మాత్రమే ఉంటున్నారు. 'తక్కువ బోధన - ఎక్కువ పరిశీలన' (లెస్ టీచింగ్ - మోర్ అబ్సర్వేషన్ ) సూత్రాన్ని ఇక్కడ పాటిస్తున్నారు.ఇంక్లూషన్ . అలాగే సమగ్ర విద్య (ఇంక్లూషన్ ఎడ్యుకేషన్ ) విధానాన్ని లోతుగా అధ్యయనం చేశారు. ఈ 10 రోజుల పాటు ఫిన్లాండ్‌లో అధ్యయనం చేసిన విద్యా విషయాలు, కరికులం రిఫార్మ్స్ (పాఠ్యప్రణాళిక సంస్కరణలు), పర్యవేక్షణ విధానం, పరిశుభ్రత నియమాలు, సమయపాలన, పేరెంట్-టీచర్ సమావేశాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర నివేదికను (డాక్యుమెంటరీ రూపంలో) ఉపాధ్యాయ బృందం ప్రభుత్వానికి సమర్పించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఈ ఉత్తమ విధానాలను మన రాష్ట్రంలో అమలు చేసి, ఏపీ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలపడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని ఉపాధ్యాయ బృందం పేర్కొంది.








కామెంట్‌లు (0)