మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జడ్పీ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్‌, ఎస్‌పి

9 గంటల క్రితం

rajababu.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 05:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు తెలిపారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్‌పి వి.హర్షవర్ధన్‌రాజుతో కలిసి ఒంగోలులోని జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యాలయంతోపాటు ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 27 జడ్పీటీసీ స్థానాలకు ఇక్కడే నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా మండల కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్‌పి వి.హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ జడ్పీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు.

ఈ పరిశీలనలో జడ్పీ సీఈఓ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్