- తన ఆవేదన లిఖితపూర్వకంగా రాసుకొని పొగాకు బోర్డులో వేలం జరుగుతున్న సమయంలో పురుగుల మందు తాగిన రైతు
- భారీగా అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహుతికి పాల్పడ్డ మిట్టపాలెం రైతు
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన రైతన్న
ప్రజాశక్తి - కొండపి (ప్రకాశం) : అప్పుల బాధ తట్టుకోలేక పురుగులు మందు తాగి ఆత్మహుతికి పాల్పడిన సంఘటన కొండపి పొగాకు వేలం కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .... కొండపి మండలంలోని మిట్టపాలెం గ్రామానికి చెందిన మండల కోటిలింగం (64) అనే పొగాకు రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహుతికి పాల్పడటం జరిగింది. గత మూడు సంవత్సరాల నుంచి ఏ పంట వేసినా కలిసి రాక పోవడంతో అసలు, వడ్డీ పెరిగి భారీ స్థాయిలో అప్పులు పెరిగాయి. మండవ కోటిలింగంకు మిట్టపాలెం గ్రామంలో సుమారు 5 ఎకరాల పొలము ఉందని, గత మూడు సంవత్సరాల్లో కొంత అప్పు ఉండటం వల్ల నాలుగు ఎకరాలు అమ్మి ఆ అప్పును తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన డబ్బు, కొంత అప్పు చేసి ఉన్న ఎకరంతోపాటు పది ఎకరాలు కౌలుకు తీసుకొని గత మూడు సంవత్సరాల నుంచి మిరప, శెనగ, పొగాకు పంటలు వేసినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో భారీగా రూ.40 నుంచి రూ.50 లక్షలు అప్పు తేలిందని తెలిపారు. అదేవిధంగా తన కొడుకు కోటి కూడా కొండపిలో పలు వ్యాపారాలు చేసినప్పటికీ కలిసి రాకపోవడంతో ఇంకా కాస్త అప్పు పెరిగింది. ఆ అప్పును ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతూ ఉన్నాడు. సోమవారం తన ఇంటి వద్ద నుంచి చెట్లకు చీడ నుంచి తొలగించే మందును తీసుకొని కొండపి వేలం కేంద్రానికి చేరాడు. అప్పటికే ఇంటి వద్దనే తెల్ల కాగితంపై తన ఆవేదనను వ్యక్తం చేసుకొని ఆ లేఖను తన చొక్కాలో పెట్టుకొని ఉండటం జరిగింది. పొగాకు వేలం జరుగుతున్న సమయంలో వెనుక పక్కకి వెళ్లి తను తెచ్చుకున్న మందును గ్లాసులో పోసుకొని తాగాడు. అక్కడున్న వారు వెంటనే గమనించి కోటిలింగయ్యను కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలుకు తీసుకొని పోవడం జరిగింది. కోటిలింగయ్య ఆవేదన ప్రకారం గత మూడు సంవత్సరాల నుంచి మిరప శెనగ పొగాకు పంటలు వేసినప్పటికీ ఏ పంటలో కూడా తనకు కలిసి రావడం లేదని అప్పులు బాగా పెరిగిపోవడం జరిగిందని లెటర్లో తెలిపాడు. తన చనిపోయిన అనంతరం తన కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆ లెటర్లో ఆయన కోరారు. పొగాకు రైతులు జాగ్రత్తపడి అప్పుల బాధ పడకుండా ఉండాలని లేఖలో కోరారు. రాష్ట్ర మంత్రి స్వామి, రాష్ట్ర మారటం బోర్డ్ చైర్మన్ సత్య, వైసిపి కొండపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమానపు సురేష్, మాదాసి వెంకయ్య అందరూ కలిసి తన కుటుంబాన్ని కాపాడాలని ఆ లేఖలో రైతు కోరుకున్నారు.








కామెంట్లు (0)