ప్రజాశక్తి -టంగుటూరు (ప్రకాశం) : పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ .... బుధవారం ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిఫై సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో పొగాకు రైతులు రాస్తోరోకో చేపట్టారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రైతులు నిరసన తెలిపారు. పోలీసులు రైతులను, రైతు నాయకులను అరెస్టు చేశారు.

పొగాకు రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం పై రైతన్నలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని, సరాసరి లో గ్రేడ్ పొగాకు ఇప్పటికే 160 రూపాయలకు కేజీ కొంటుంటే 110 రూపాయలకు కేజీ కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలను వెనక్కు తీసుకోవాలని, సరాసరి పొగాకు కిలో 250 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ .... బుధవారం వందలాది మంది పొగాకు రైతులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. టంగుటూరు, కొండేపి, కందుకూరు వేలం కేంద్రాల పరిధిలోని గ్రామాల నుండి వందలాది మంది రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో కిలోమీటర్లు పొడవున వాహనాలు ఆగిపోయాయి. మార్కెట్లో పొగాకు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు దిగజార్చారని, గత సంవత్సరం కేజీ సరాసరి 250 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం సరాసరి 190 రూపాయలు పలుకుతూ పొగాకు రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిందని... అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు వ్యాపారుల ప్రయోజనాల రక్షణకే ఉన్నామంటూ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పొగాకుతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలలో వివిధ రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంటే వాటిల్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించడానికి వెనకాడటం వ్యాపారుల ప్రయోజనాలకేనన్నారు, ఇప్పటికైనా పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రానట్లయితే ఢిల్లీ రైతాంగం తరహాలో చలో అమరావతి చేపడతామని నాయకులు హెచ్చరించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా యస్ కె యం నాయకత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఎస్ కే యం నాయకులు హెచ్చరించారు. జాతీయ రహదారి దిగ్బంధనం చేస్తున్న రైతులను యస్ కి యం, రైతు సంఘాల నాయకులను పోలీసులు బలవంతపు అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన వారిలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరావు, సిఎస్ సాగర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు రైతు సంఘం, కార్మిక సంఘం నాయకులు సింగయ్య, కొండారెడ్డి, ఆర్ మోహన్, లక్ష్మీ, ప్రభాకర్, వెంకట్ రావు రఘురాం, పమిడి నాగేశ్వరరావు, రమాదేవి ఏసుపోగు బాలకోటయ్య తదితరులు ఉన్నారు.








కామెంట్‌లు (0)