సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాగావళి ఉగ్రరూపం - ప్రజాజీవనం అస్తవ్యస్తం ..!

2 రోజుల క్రితం

Nagavali's Fury – Public Life Disrupted..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 01:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

*జలదిగ్బంధంలో గ్రామాలు

*అండగా ఉంటాం అన్న ఎమ్మెల్యే రవికుమార్

*సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు

*సందర్శించిన ఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి


ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. నది ప్రవాహం తీవ్రరూపం దాల్చడంతో మండలంలోని అల్లిన, కిల్లంతరి, జీవి పురం, పనుగు పర్త, బూర్జ, తదితర గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల మధ్యకు వరద నీరు భారీగా చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించి, ప్రజాజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది.


044


ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాలకు కలెక్టర్, ఎస్పీ....

పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి తక్షణమే స్పందించారు. శుక్రవారం నాడు తెల్లవారుజామున వర్షాన్ని, వరదను లెక్కచేయకుండా వారు స్వయంగా ట్రాక్టర్‌పై అల్లిన గ్రామానికి చేరుకున్నారు. గ్రామాలు, ఇళ్లలోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి .... ప్రజలతో పాటు మూగజీవాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను, రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.అనంతరం ఎయిర్ బోట్ల ద్వారా పనూగు పర్త గ్రామం తోపాటు ఇతర ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.


011


సైడ్ వాల్ నిర్మాణానికి ₹3 కోట్ల తక్షణ నిధులు ...

నాగావళి నదికి రక్షణగా 'సైడ్ వాల్' లేకపోవడం వల్లే ప్రవాహం నేరుగా గ్రామాలపైకి వస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీని నిర్మాణానికి సుమారు ₹5.50 కోట్లు అవసరమవుతాయని వివరించగా, కలెక్టర్ స్వప్నల్ దివాకర్ సానుకూలంగా స్పందించి తక్షణ సాయం కింద ₹3 కోట్ల నిధులను మంజూరు చేశారు.


‘అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం’....

వరద నీటిలోనే నడుచుకుంటూ అల్లిన గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కూన రవికుమార్, బాధితులను పరామర్శించారు. వర్షాల కారణంగా సర్వస్వం కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్షం కారణంగా పంట పొలాలు ముంపుకు గురయ్యాయని అయితే వరద నీరు తగ్గు ముఖం పట్టిన తర్వాత రైతులకు యూరియా ఎంతగానో అవసరం ఉంటుందని కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ యూరియా అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.


022


రహదారి నిర్మాణమే కొంప ముంచింది : చింతాడ రవికుమార్ ఆరోపణ

మదనాపురం నుండి అల్లిన వరకు ₹6 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు గ్రామాలు ముంపుకు గురయ్యాయని వైయస్సార్సీపి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజల ఇబ్బందులపై ఆరా తీశారు.


8 వేల ఎకరాలు ముంపు ....

ఈ వర్షాలు రైతులకు కోలుకోలేని దెబ్బతీశాయి. బూర్జ మండలం కాలపర్తి పంచాయతీ పరిధిలోని వైపర్త రెవెన్యూ బౌండరీ నుండీ మండల శివారు కాలపర్త గ్రామం వరకు సుమారు 8 వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతన్నలు కంటనీరు పెట్టుకుంటున్నారు.


033


మండలం అతలాకుతలం ...

విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా మండలంలోని పలు గ్రామాలకు గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అంధకారంలోనే గ్రామాలు ఉన్నాయి. శతాబ్దం నాటి భారీ వృక్షాలు నేలకొరిగాయి . ఏది ఏమైనా ఈ వర్షం మండలాన్ని అతులాకుతలం చేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ డైరెక్టర్ అనిపు రామకృష్ణ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీరు కట్ల విశ్వప్రసాద్, వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, జడ్పిటిసి రామారావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వావిలిపల్లి సీతారాంబాబు నాయుడు, తోపాటు శ్రీకాకుళం డి.ఎస్.పి. వివేకానంద్, లు సందర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్