సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాగవళి ఉగ్రరూపం ..

3 రోజుల క్రితం

Nagavalli's ferocious form...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వర్షం బీభత్సం...! *జలదిగ్బంధంలో బూర్జ గ్రామాలు

*కూలుతున్న వృక్షాలు

ధ్వంసం అయినా రహదారులు

అంధకారంలో అల్లాడుతున్న గ్రామాలు


ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : వర్షం బీభత్సం సృష్టిస్తుంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురుస్తున్న వర్షాలు శ్రీకాకుళం జిల్లాను విలవిలలాడిస్తున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న నాగవళి నది ఉగ్రరూపానికి బూర్జ మండలంలోని పలు గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా అల్లిన ,కిల్లంతరి,జీవిపురం గ్రామాల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.

nagavali


నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి ఊళ్లకు ఊళ్లే చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి శతాబ్దాల నాటి భారీ వృక్షాలు సైతం సమూలంగా నేలకొరిగాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో ఊళ్లకు ఊళ్లే అంధకారంలోకి జారిపోయాయి. కనీసం ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి, రాత్రి వేళ దీపం వెలిగించుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి దాపరించింది.


ఇళ్లలోకి చేరిన వరద నీరు...

వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వర్షపు నీరు ఏరులై పారి, నేరుగా ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. నిమిష వ్యవధిలోనే ఇళ్లలోని ధాన్యపు బస్తాలు, నిత్యావసర వస్తువులు నీట మునిగిపోయాయి. వంట వార్పు చేసుకునే వీలు లేక, తాగేందుకు రక్షిత మంచి నీరు దొరకక పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు. "ఇంట్లో ఉందామంటే నీళ్లు ముంచెత్తుతున్నాయి.. బయటకెళ్దామంటే చుట్టూ అగాధ లాంటి వరద నీరు.. మమ్మల్ని కాపాడేవారే లేరా?" అంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.


nagavali

కానరాని అధికార యంత్రాంగం..

ఒకవైపు నాగవళి నది పరివాహక ప్రాంతం భయానక వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు ప్రజలు భయంతో దిక్కుదిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ, అధికార యంత్రాంగం ఆచూకీ కానరాకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆహార పొట్లాలు, తాగునీరు అందించేందుకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఇటువైపు చూడకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు గంటగంటకూ పెరుగుతుండటంతో క్షణమొక యుగంలా గడుస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, జలదిగ్బంధంలో చిక్కుకున్న తమకు సహాయక చర్య చేపట్టాలని అల్లిన జీవీపురం గ్రామస్తులు వేడుకుంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్