* ఆంధ్రా, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యం
* సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అసోం ఐజి జి.వి.శివప్రసాద్
ప్రజాశక్తి - పొందూరు, శ్రీకాకుళం జిల్లా
ఇటీవల కన్యాకుమారి నుంచి దిబ్రూగర్‌కు వెళ్లే వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ అసోం యువతి హిమశ్రీ బోరో (22) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్ర ముఖ్యమంత్రుల జోక్యంతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని పెనుబర్తి సమీపంలో రైలు పట్టాలు పక్కన యువతి మృతదేహం లభించిన స్థలాన్ని స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులతో కలిసి అసోం ఐజి జి.వి.శివప్రసాద్ శనివారం పరిశీలించారు. యువతి జారిపడిపోయారా? లేదా? రైలు నుంచి నెట్టివేయడంతో మృతి చెందారా? అన్న విషయంపై సంఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కేసు విషయంపై అసోం నుంచి వచ్చిన ఐజి మాట్లాడుతూ ఈ సంఘటనపై అసోంలోని మీడియా, సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు రావడంతో ముఖ్యమంత్రి స్పందించారని తెలిపారు. దీనిపై అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రైల్వే మంత్రికి యువతి మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ లేఖలు రాయడంతో పాటు ఒక సీనియర్ పోలీస్ అధికారిని నియమించారు. ఇక్కడికి వచ్చిన తరువాత రైల్వే ఐజి, రేంజ్ ఐజి, జిల్లా ఎస్‌పిలతో మాట్లాడారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారణపై వివరించారు. ఆయన వెంట ఎస్‌పి కె.వి.మహేశ్వరరెడ్డి, డిఎస్‌పి ధనుంజయనాయుడు, జిఆర్‌పి డిఎస్‌పి ప్రమోద్ ఉన్నారు.








కామెంట్‌లు (0)