ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్
హెచ్ఐవి నియంత్రణతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సేవలు, సంరక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఇ.వి.ఎన్ నరేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా కమ్యూనిటీ రిసోర్స్ గ్రూప్ (డి-సిఆర్జి) సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి నియంత్రణపై సమాజంలో విస్తృత అవగాహన పెంచడంతో పాటు బాధితులకు ఎఆర్టి సేవలు సక్రమంగా అందేలా చూడాలని స్పష్టం చేశారు. నిర్దేశిత 95-95-95 లక్ష్యాల సాధనకు సంబంధిత విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ వర్గాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను డిఎంహెచ్ఒ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో జిల్లా ఎయిడ్స్, టిబి నివారణ అధికారి టి.శ్రీకాంత్, రాష్ట్ర సిఆర్జి సభ్యురాలు సుధారాణి, కె.వి.ఆర్ శైలజ, ఎఆర్టి మెడికల్ ఆఫీసర్ ఎం.చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)