* ఎకరాల భూమి సెంట్లలోకి!
* రాజపురంలో రికార్డుల తారుమారు
* 50 శాతానికి పైగా రైతులకు ఇక్కట్లు
ప్రజాశక్తి - కవిటి
కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది రాజపురం రైతుల పరిస్థితి. భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాల్సిన రీ సర్వేలోనే అంకెలు తారుమారయ్యాయి. రైతుల భూములకు రక్షణగా నిలవాల్సిన రికార్డులే వారి హక్కులకు ప్రశ్నార్థకంగా మారాయి. రాజపురం పరిధిలో మూడెకరాల భూమి ఉన్న రైతుకు రికార్డుల్లో 30 సెంట్లే మిగిలింది. 2.22 ఎకరాలున్న మరో రైతుకు 1.15 ఎకరాలే నమోదైంది. 1.80 ఎకరాల భూమి ఉన్న ఇంకో రైతుకు 1.24 ఎకరాలే చూపించారు. ఒకే రైతు భూమిని మూడు ఖాతాలుగా విభజించిన ఉదంతాలూ వెలుగు చూశాయి. చివరికి ఎప్పుడో భూమి అమ్మేసిన రైతుకు మళ్ళీ ఆ భూమి దఖలు చేసిన విడ్డూరం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాజపురం పరిధిలో 50 శాతానికి పైగా రైతుల భూముల వివరాల్లో తేడాలు వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి విస్తీర్ణమే రికార్డుల్లో తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించిన రీ సర్వే.. ఇప్పుడు కొత్త సమస్యలకు కేంద్రంగా మారింది.
నోటీసుల పంపిణీలోనూ నిర్లక్ష్యమేనా?
రీ సర్వేలో నమోదైన భూముల వివరాలను రైతులకు తెలియజేయాల్సిన ప్రక్రియపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం 90 రోజుల్లో అందించాల్సిన 9/2 నోటీసులు తమకు అందలేదని బాధిత రైతులు చెప్తున్నారు. క్షేత్రస్థాయికి వచ్చిన విఆర్ఒలు సైతం రికార్డుల్లో నమోదైన విస్తీర్ణం, వాస్తవ భూమి వివరాలను స్పష్టంగా చెప్పలేదని ఆరోపిస్తున్నారు. పాసు పుస్తకాల పంపిణీ కోసం ఆధార్ కార్డులు, పాస్ ఫొటోలు మాత్రం అడిగారని అంటున్నారు. భూముల వివరాల్లో తేడాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయకుండా పాసు పుస్తకాల కోసం హడావుడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ భూమి ఎంత ఉందో తేల్చకుండా పాసు పుస్తకాలు ఎలా తీసుకోవాలని సతమతమవుతున్నారు.
సమన్వయలోపమే కారణమా?
రీ సర్వేలో జరిగిన తప్పిదాలకు విఆర్ఒ, సర్వేయర్ మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. సిబ్బంది మధ్య విభేదాలు కూడా ఈ వ్యవహారంపై ప్రభావం చూపినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. స్థానిక నాయకుడి అండతో సర్వేయర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. మరోవైపు తప్పిదాల నేపథ్యంలో కవిటి తహశీల్దార్ సంబంధిత సర్వేయర్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఉన్నతాధికారుల చొరవతో సదరు సర్వేయర్ తిరిగి విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. సమస్యను గుర్తించిన ఆర్డీఓ రాచర్ల అప్పలరాజు సంబంధిత సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రెవెన్యూ సిబ్బందికి హితబోధ చేసినట్లు సమాచారం.
రెండేళ్లుగా ఆపరేటర్ కరువు!
కవిటి తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడం పరిపాలనా సమస్యలను మరింత పెంచుతోంది. గత రెండేళ్లుగా ఆపరేటర్ లేకపోవడంతో కంప్యూటర్ పనుల్లో ప్రావీణ్యం ఉన్న ఓ విఆర్ఒతోనే పనులు జరుగుతున్నాయి. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూ ఆపరేటర్ లేని ఏకైక తహశీల్దార్ కార్యాలయం కవిటేనని స్థానికంగా చెప్తున్నారు. సిబ్బంది కొరతతో కార్యాలయ పనులతో పాటు రైతుల భూ సంబంధిత సేవలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిమిత వనరులతోనే అధికారులు నెట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిబ్బంది కొరతకు రైతులు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు రావాలన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సవరణల పేరుతో మళ్లీ ప్రదక్షిణలా?
రీ సర్వేలో తప్పులు జరిగితే వాటిని సరిచేయాల్సిన బాధ్యత అధికారులదే. కానీ రాజపురంలో రికార్డుల సవరణ కోసం రైతులే మళ్లీ మ్యుటేషన్ ప్రక్రియను ఆశ్రయించాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. భూమి విస్తీర్ణంలో తేడా ఎదుర్కొంటున్న ఓ రైతు సర్వేయర్‌ను సంప్రదించగా, పాస్ పుస్తకం వచ్చిన తర్వాత మ్యుటేషన్ పెట్టించి సరిచేద్దామని చెప్పినట్లు సమాచారం. సాధారణంగా మ్యుటేషన్ ప్రక్రియకు సుమారు 30 రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు. దరఖాస్తు, పరిశీలన, సవరణల పేరుతో మరింత జాప్యం జరిగితే రైతులు మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. రీ సర్వేలో జరిగిన తప్పుకు రైతు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, సమయం వెచ్చించడం, అధికారుల చుట్టూ తిరగడం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉంది.









కామెంట్‌లు (0)