సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మింగేస్తున్న అలలు.. కరిగిపోతున్న తీరం

1 గంట క్రితం

మింగేస్తున్న అలలు.. కరిగిపోతున్న తీరం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​పిజిపేటలో అలల తాకిడికి కోతకు గురవుతున్న మత్స్యకార భవనం

ఆందోళనలో మత్స్యకారులు

కలెక్టర్‌కు సమాచారం అందించిన గ్రామపెద్దలు

చర్యలు చేపట్టాలని ఆదేశించిన కలెక్టర్

జెసిబితో మట్టికప్పి తాత్కాలిక చర్యలు చేపట్టిన జిల్లా అధికారులు

తుఫాను ప్రభావంతో పిజిపేటలో మరింత భయాందోళనలు


ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ

ఇటీవలే నలుగురిని బలి తీసుకున్న సముద్రం ఆర్నబ్ తుపాను ప్రభావంతో గ్రామాన్ని కూడా ముంచేస్తుందంటూ పిజిపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రూరల్ మండలంలోని పిజిపేట గ్రామ సముద్ర తీరంలో ఆదివారం పౌర్ణమి ఆటుపోట్లకు తీరం కోతకు గురైంది. సముద్రపు అలల తాకిడికి తీరంలో ఉన్న మత్స్యకార వలల రక్షిత భవనం పునాదులు బయటపడ్డాయి. నాగావళి నది దిశ మార్చుకొని ప్రవహిస్తున్న మార్గంలోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో నదీ ప్రవాహ మార్గం, సముద్ర తీరం కలిసిపోయాయి. దీంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు తీరాన్ని మరింతగా కోతకు గురిచేస్తున్నాయి. తీరంలో వలలను భద్రపరిచే భవనం సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. ఇటీవలే పిజిపేటలో టూరిజం అధికారులు రెండున్నర కోట్లు నిధులతో నిర్మించిన రిసార్ట్ భవనం కూడా తీరం కోతకు గురై సముద్రపు కాలగర్భంలో కలిసి పోయింది. ఇప్పుడు వలల సంరక్షణ భవనం కూడా కోతకు గురవుతూ ఉండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.


​తీరంలో ఆందోళన

నాగావళి నదిలో వరద ఉధృతి కారణంగా నది ప్రవాహం దిశను మార్చుకొని సముద్రంతో కలిసిపోయి గ్రామాలను ముంచే పరిస్థితి ఏర్పడింది. దీంతో పిజిపేట సముద్రతీరం కోతకు గురవుతుండడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ రెండు కోట్ల నిధులతో నది ప్రవాహానికి అడ్డుకట్టగా గ్రోయిన్ (రాళ్లతో నది ప్రవాహాన్ని అడ్డుకునే రక్షణ గోడను) నిర్మించారు. అయితే సముద్రంలో నీటి ప్రవాహం పెరిగి అలల తాకినికి నేడు గ్రోయిన్ సైతం సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం గ్రోయిన్ మీద నుంచి సముద్రపు అలలు ఎగసిపడటంతో గ్రామంలోకి నీరు చేరుతుందన్న భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులంతా తీరం వద్దకు చేరుకొని పరిస్థితిని వీడియో రూపంలో గ్రామపెద్దల ద్వారా జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్‌కు కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందించారు. దీంతో స్పందించిన కలెక్టర్ తక్షణం ముంపు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.


​కంటి తుడుపు చర్యలే.?

అప్రమత్తమైన అధికారులు పిజిపేట తీరం చేరుకొని ట్రాక్టర్లతో మట్టిని తరలించి, జెసిబి సాయంతో తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు.

గతంలో రూ.2 కోట్లతో నిర్మించిన గ్రోయిన్‌లో కొంత భాగం ఇసుకలో కూరుకుపోయింది. నాగావళి ప్రవాహ మార్పుల కారణంగా గత ఎనిమిదేళ్లుగా తీరంలో లోతైన ప్రాంతాలు ఏర్పడ్డాయి. తుపాను ప్రభావంతో అలల ఉద్ధృతి పెరిగి సముద్రపు నీరు సుమారు 100 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చి జీడిమామిడి తోటల్లోకి చేరుతోంది. ఈ ప్రాంతంలో గతంలో సముద్రంలో మునిగి నలుగురు మృతి చెందడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టి, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్