- ఎంపిపి పదవి కోసం టీడీపీ, బీజేపీ మధ్య పోటీ!
ప్రజాశక్తి - శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండల ఎంపిపి ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకు టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు ఎన్నికల సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఎంపిపి ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సమావేశం నిర్వహించాలంటే తప్పనిసరిగా కోరం ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైన సభ్యుల సంఖ్య ఉంటేనే ఎన్నికల సమావేశాన్ని నిర్వహించేందుకు వీలవుతుందని తెలిపారు. మధ్యాహ్నం తర్వాత ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సభ్యులు వచ్చిన అనంతరం ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామని ప్రకటించారు.
ఇప్పటికే ఎంపిపి పదవి విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో తాజా పరిణామాలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత సభ్యులు హాజరవుతారా? ఎంపీపీ ఎన్నిక సజావుగా జరుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. తాడిమర్రి ఎంపీపీ ఎన్నిక వ్యవహారం టీడీపీ, బీజేపీ మధ్య రాజకీయ దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది.
మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 5 స్థానాలు, వైసీపీ 3 స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే ఎంపిపి పదవి విషయంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీ సభ్యురాలు రత్నమ్మకు ఎంపిపి పదవి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అత్యధికంగా 5 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీడీపీకే ఎంపిపి పదవి దక్కాలని టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో తాడిమర్రి మండలంలో ఎంపిపి పదవి ఎవరికి దక్కుతుందన్న అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఇరు పార్టీల నాయకుల డిమాండ్ల నేపథ్యంలో ఎంపిపి ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని స్థానికంగా ఆసక్తి నెలకొంది.








కామెంట్లు (0)