-ఎమ్మెల్యే కార్యాలయ పొలిటికల్ కోఆర్డినేటర్ పి. శ్రీనివాసులు హెచ్చరిక
ప్రజాశక్తి – హిందూపురం
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయ పొలిటికల్ కోఆర్డినేటర్ పి. శ్రీనివాసులు హెచ్చరించారు. పదవి కోసం వ్యక్తిగతంగా బలప్రదర్శనలు చేయడం, అనవసర సమావేశాలు నిర్వహించడం, ఇతరులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం తగదని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఈ విషయాలను వెల్లడిస్తూ.. కొంతమంది నాయకులు, కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ అనుమతి లేకుండానే వైస్ చైర్మన్ పదవి తమకే దక్కాలంటూ ప్రయత్నాలు చేయడం, పత్రికల్లో ప్రకటనలు, కథనాలు వచ్చేలా వ్యవహరించడం వంటి పరిణామాలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లాయని తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పార్టీ కూడా సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎంపిక, నియామకం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్యే బాలకృష్ణ చేపడతారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా అనవసర రాజకీయాలు చేసినా, బహిరంగంగా మాట్లాడినా ఎంతటివారైనా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు, కౌన్సిలర్లు వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పి. శ్రీనివాసులు సూచించారు.







కామెంట్‌లు (0)