పోస్టర్ ఆవిష్కరించిన మావూరి వెంకట రమణ, కంకటాల మల్లికార్జున రావు
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : చిన్నారుల్లో పుస్తక పఠనాసక్తి, సృజనాత్మకత, సాహిత్యాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ఏడో ఎడిషన్ శనివారం నుంచి హవామహల్‌లో ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం సిరిపురంలోని వివన్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ, కంకటాల గ్రూప్ చైర్మన్ కంకటాల మల్లికార్జున రావు ఆవిష్కరించారు. అనంతరం ఫెస్ట్ డైరెక్టర్లు సోనాల్ సర్దా, ప్రియ గోపాలకృష్ణన్, సంధ్య గోడే కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఫెస్ట్‌ను ప్రారంభించనుండగా, ఎంపీ ఎం. శ్రీభరత్ గౌరవ అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. 2018 నుంచి లిట్ లాంటెర్న్ ఫర్ కల్చర్ అండ్ లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుక దేశంలోని ప్రముఖ బాలల సాహిత్యోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని నిర్వాహకులు తెలిపారు. 4 నుంచి 16 ఏళ్ల వయసు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని, మూడు వయో విభాగాలుగా విభజించి ప్రతిరోజూ 50 ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది 20 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, కథకులు, నాటకరంగ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. కథా కథనం, చిత్రలేఖనం, పప్పెట్రీ, థియేటర్, సృజనాత్మక రచన తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భారతీయ ప్రచురణ సంస్థలకు చెందిన వెయ్యికి పైగా పుస్తకాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. చిన్నారులు తమ అభిమాన రచయితలను నేరుగా కలుసుకుని మాట్లాడే అవకాశం కూడా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం పిల్లలతో మెరుగైన సంభాషణ, పఠనాసక్తి పెంపొందించే అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగరంతోపాటు పరిసర ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు www.litlantern.in ను సంప్రదించవచ్చని తెలిపారు.








కామెంట్‌లు (0)