శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రూ. 26 వేలు వేతనం చెల్లించాలి

30 జులై, 2026

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 12:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విశాఖలో వేలాదిమంది కార్మికులతో మహా ప్రదర్శన - కలెక్టరేట్ ధర్నా

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్: కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు, షెడ్యూల్ ఎంప్లాయిస్ కు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం విశాఖపట్నంలో వేలాది మందితో మహా ప్రదర్శన జరిగింది. సరస్వతి పార్కు వద్ద ప్రారంభమైన ప్రదర్శన, సరస్వతి జంక్షన్, జగదాంబ జంక్షన్, లేపాక్షి జంక్షన్, కెజిహెచ్ మీదుగా కలెక్టరేట్ కు చేరింది. ప్రదర్శనకు అగ్రభాగంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కె ఎస్ వి కుమార్, అధ్యక్షులు కె.ఎం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పి.మణి, పి.వెంకటరెడ్డి, బి.జగన్, కోశాధికారి ఎస్.జ్యోతీశ్వరరావు, వి.కృష్ణారావు నడిచారు. వీరితోపాటు జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు,ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.సుబ్బారావు, హాస్పిటల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి. వెంకటరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పలు యూనియన్ల బ్యానర్లతో, డిమాండ్లతో కూడిన ప్లకార్డులు,సిఐటియు జెండాలతో మహాప్రదర్శన నగర ప్రజలను ఎంతగానో ఆకర్షించింది.

కలెక్టరేట్ ఎదుట ధర్నా :

మహా ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ చేరిన సిఐటియు నాయకులు కార్యకర్తలు కలెక్టరేట్ ప్రవేశ మార్గం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కనీస వేతనాలు జివోలను 2007 నుంచి సవరించకపోవడం వల్ల, అసంఘటితనంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. షాపింగ్ మాల్స్ పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, చిన్న పరిశ్రమలు, డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు వంటి రంగాలలో ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 12 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. గత రెండు దశాబ్దాలలో నిత్యవసర వస్తువులు ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల విద్య ఖర్చులు, వైద్య ఖర్చులు, రవాణా చార్జీలు భారీగా పెరిగినప్పటికీ కార్మికుల జీతాలు మాత్రం పెరగలేదు అన్నారు. ఎనిమిది గంటలు పని విధానం అమలు కాకుండా, చాలాచోట్ల కార్మికులతో రోజుకు 12 గంటలు పని చేస్తున్నారని ఆరోపించారు. పిఎఫ్, ఇఎస్ఐ, వారాంతపు సెలవులు అంటే కనీస కార్మిక హక్కులు కూడా అనేక సంస్థలలో అమలు కావడం లేదన్నారు. హక్కుల కోసం మాట్లాడితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. షాపింగ్ మాల్స్ లో ఖాళీ సమయంలో కార్మికులు టూల్స్ పై కూర్చోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలలో విలీనం చేయకుండా, అతి తక్కువ వేతనాలతో పని చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 20 శాతం, కర్ణాటకలో 60 శాతం వరకు కనీస వేతనాలు పెంచిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కనీస వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు తక్కువ కాకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలన్నారు. పాత కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఇక్కడితో ఈ ఉద్యమం ఆగదని రాష్ట్రస్థాయిలో త్వరలోనే ఉద్యమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్