ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌ఐసి లో మరిన్ని వాటాల విక్రయాన్ని ఖండిస్తూ ... ఎంప్లాయిస్ నిరసన ప్రదర్శన

05 ఆగస్టు, 2026

Employees stage protest against the sale of further stakes in LIC.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 04:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విశాఖ : ఎల్‌ఐసి లో మరిన్ని వాటాల విక్రయాన్ని ఖండిస్తూ .... బుధవారం మధ్యాహ్నం లంచ్ అవర్ లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ చేపట్టిన నిరసన ప్రదర్శన విజయవంతమయ్యింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - LIC లో ప్రభుత్వం తన వాటాను మరింత తగ్గించాలన్న నిర్ణయాన్ని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ - ICEU, విశాఖపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ గంటా వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. 2026 ఆగస్టు 3 న కేంద్ర ప్రభుత్వం OFS ద్వారా LIC చెల్లించిన ఈక్విటీలో 2.5% వాటాలను విక్రయిస్తామని, అదనంగా 4% గ్రీన్‌షూ ఆప్షన్ ఉంటుందని ప్రకటించింది. దీంతో మొత్తం విక్రయం 6.5%కు చేరుతుంది. SEBI నిబంధనలను సాకుగా చూపుతున్నప్పటికీ, ఇది దేశంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థపై ప్రజా యాజమాన్యాన్ని బలహీనపరిచే చర్యేనని ఆయన అన్నారు. 2022లో జరిగిన IPOలో ఇప్పటికే 3.5% వాటాలు విక్రయించారు. "ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాం" అన్న ప్రభుత్వ మాటలకు ఇది పూర్తి విరుద్ధమని చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనలో విఫలమైన కేంద్రం, ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటోందని ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 7 PSUలలో వాటాల విక్రయం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించింది. LIC అనేది కేవలం లాభాల సంస్థ కాదని, కోట్లాది పాలసీదారుల విశ్వాసంతో నిలిచిన జాతీయ సంస్థ అని ICEU గుర్తు చేసింది. ప్రభుత్వ వాటా తగ్గింపు పాలసీదారులు, ఉద్యోగులు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని, కావున ప్రతిపాదిత OFSను వెంటనే ఉపసంహరించుకోవాలని, PSUల ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని ICEU కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లతో ఈ రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో జరిగిన నిరసన ప్రదర్శన విజయవంతం అయ్యింది. ఈ ప్రదర్శనలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్స్ పాల్గొన్నారు. "LIC భారత ప్రజలది, స్టాక్ మార్కెట్‌ది కాదు" అనే నినాదంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఈ పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని యూనియన్ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్