* 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : భారత సముద్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి శనివారం విశాఖపట్నంలో భారత నౌకాదళంలో అధికారికంగా చేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్టెల్త్ ఫ్రిగేట్‌ను తూర్పు నౌకాదళం (ఈస్ట్రన్ ఫ్లీట్)కు అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ .... ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన యుద్ధనౌకల నిర్మాణంలో భారత్ ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, డ్రోన్లు, సైబర్ యుద్ధం, హైపర్‌సోనిక్ ఆయుధాలు వంటి ఆధునిక సాంకేతికతలు యుద్ధ స్వరూపాన్ని మార్చుతున్నప్పటికీ, సంప్రదాయ సైనిక శక్తి ఇప్పటికీ దేశ భద్రతకు మూలాధారమని అన్నారు. ఆధునిక సాంకేతికత, సంప్రదాయ రక్షణ వ్యవస్థలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని తెలిపారు. భారత నౌకాదళం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో "ఫస్ట్ రెస్పాండర్", "ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్‌నర్"గా గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు.

నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ ... ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి చేరికతో భారత నౌకాదళం కార్యాచరణ సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. ప్రాజెక్ట్-17ఏ యుద్ధనౌకల నిర్మాణంలో దేశీయ పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, నౌకాదళం సమిష్టిగా పనిచేసి ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పాయని తెలిపారు. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరు మీద నామకరణం చేసిన ఈ యుద్ధనౌక "మైటీ, మెజెస్టిక్, మ్యాచ్‌లెస్" అనే నినాదంతో భారత సముద్ర రక్షణకు కొత్త బలాన్ని అందించనుంది. తూర్పు నౌకాదళంలో చేరిన అనంతరం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత వ్యూహాత్మక ఉనికిని మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర భద్రత, విపత్తు సహాయక చర్యలు, సముద్ర గస్తీ, జలాంతర్గామి నిరోధక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన ఆరో స్టెల్త్ ఫ్రిగేట్ అయిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళం వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించగా, ముంబైలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. సుమారు 6,670 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ యుద్ధనౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ భాగాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం విశేషం. గరిష్ఠంగా 28 నాట్స్ వేగంతో ప్రయాణించే ఈ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, జలాంతర్గాముల నుంచి వచ్చే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ యుద్ధనౌకలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులను అమర్చే సదుపాయం, మధ్యశ్రేణి ఉపరితలం-నుంచి-గగనతలం క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, టార్పెడో లాంచర్లు, జలాంతర్గామి నిరోధక ఆయుధాలు, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్, మల్టీ రోల్ హెలికాప్టర్ నిర్వహణ సౌకర్యం వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఆధునిక స్టెల్త్ సాంకేతికత కారణంగా శత్రువుల రాడార్లకు చిక్కకుండా కీలక ఆపరేషన్లు నిర్వహించగలదు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదాల విభాగాధిపతి సంజయ్ భల్ల, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ సిఎండి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)