ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : భారత ప్రజలమైన మనం మన కోసం సమర్పించుకున్న రాజ్యాంగం మోడీ పాలనలో తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటుందని, రాజ్యాంగపు మౌలిక స్వరూపాన్నే పూర్తిగా ధ్వంసం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ చర్యలను అడ్డుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మరుపిళ్ల పైడిరాజు అన్నారు. రాజ్యాంగాన్ని ఓటు హక్కును కాపాడుకుందాం అంటూ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో గురువారం విశాఖపట్నంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ జంక్షన్ వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... 'సర్ ' పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతోందని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటువంటి కుట్ర చేస్తోందని ఆరోపించారు. 75 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్నారు. చట్టసభల పరిపాలన వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే అధికారం చట్టసభలకు లేదని సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో స్పష్టం చేసింది అన్నారు. అయినప్పటికీ రాజ్యాంగానికి తూట్లు పొడిచే వ్యవహారం సర్ పేరుతో సాగుతుందని ఆరోపించారు. ఈ చర్యలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి. గంగారావు,ఆర్.కె.ఎస్. వి కుమార్, బి. జగన్,పి.మణి,వి. కృష్ణారావు,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. మన్మధరావు, దేవుడమ్మ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం, ఓటు హక్కును కాపాడుకుందాం : ఎం.జగ్గునాయుడు
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)