విశాఖ : విశాఖపట్నం జిల్లాలోని ఏకైక గిరిజన గురుకులం ఇంగ్లీష్ మీడియం బాయ్స్ స్కూల్‌లో విద్యను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలను మధ్యలోనే మూసివేసే ప్రయత్నం లేదా విద్యా స్థాయిని కుదించే ప్రతిపాదనల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఆదివాసీ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా ఉద్యమాలు సంఘటితమై సుదీర్ఘకాలం పోరాటం చేశాయి. ఈ సమిష్టి పోరాట ఫలితంగానే ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పల నరస పేర్కొన్నారు. బుధవారం విశాఖపట్నం NPR భవన్ CITU ఆఫీస్‌లో ఆదివాసీ ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాల జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ .... గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య చాలా అరుదు అని అన్నారు. ఆ అవకాశాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు వీధుల్లోకి రావాల్సి రావడం బాధాకరమన్నారు. అయినా ప్రజా ఒత్తిడికి ప్రభుత్వం లొంగడం ఆదివాసీ విద్యాభివృద్ధికి సానుకూల పరిణామమన్నారు. 480 మంది విద్యార్థులకు విద్య అందించాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఈ స్కూల్‌కు కూడా ఇవ్వాలన్నారు. మౌలిక సదుపాయాలు, ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు... కానీ నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే నేరుగా చేపట్టాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదు అని కోరారు. ఫిజిక్స్‌వాలా (నోయిడా)కు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒప్పందం రద్దు చేయాలన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) కింద గిరిజన గురుకులం విద్య సంస్థలను ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా తిరస్కరిస్తున్నామని, ఇది ఆదివాసీ విద్యార్థుల ఉచిత, నాణ్యమైన విద్యా హక్కుకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామన్న మంత్రి లోకేష్ ప్రకటనకు ప్రభుత్వ చర్యలు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఒక పక్క స్కూల్ మూసేసి, మరోపక్క స్కూల్ లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర వ్యాప్త గురుకుల, గిరిజన ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేయడానికి తగిన నిధులు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది కేటాయించాలని కోరారు. నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని పునరుద్ఘాటించారు. ఆదివాసీ ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధ, అణచివేత ధోరణులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 1న విశాఖకు వస్తున్న తల్లిదండ్రులు, నాయకులను విశాఖపట్నం రాకుండా అడ్డుకోవడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా లో పాడేరు , అరకు రోడ్లు బ్లాక్ చేయడం అన్యాయమన్నారు. విద్యా హక్కుల పోరాటంలో పాల్గొన్న నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులపై అరెస్టులు అక్రమం. శాంతియుతంగా హక్కుల కోసం గళం విప్పినవారిపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిముడు చిన్నం నాయుడు, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ విమెన్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాంగు చిన్ని,ఆదివాసీ మహిళల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. హైమావతి, విమల, SFI జిల్లా అధ్యక్షుడు సాయి, జిల్లా ఉపాధ్యక్షులు పి. ప్రగతి తల్లిదండ్రుల సంఘం నాయకులు రాజు, త్రినాధ్, రాము తదితరులు పాల్గొన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రభుత్వమే నిర్వహించాలి : ఆదివాసీ ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 02:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)