విభజన తర్వాత రాష్ట్రంలోనే అతి చిన్నదిగా రూపాంతరం చెందిన విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి ఇద్దరు జెడ్పిటిసిలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. కేవలం 4 మండలాలతో ఏర్పడిన విశాఖపట్నం జెడ్పిటిసికి నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. భీమిలి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం జెడ్పిటిసి స్థానాలు ఉండగా, పెందుర్తి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో పెందుర్తి జెడ్పిటిసి స్థానం మాత్రమే ఉంది. మొత్తం నాలుగు స్థానాలలో మూడింటిని టిడిపి, ఒకదానిని జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఆనందపురం నుంచి ఎన్ని శ్రీనివాసరావు (జనసేన), భీమిలి నుంచి గాడు అలివేణి, పద్మనాభం నుంచి కోరాడ సత్యవతి, పెందుర్తి నుంచి సుఖవాసి అజయ్ ( వీరంతా టిడిపి ) ఎన్నికయ్యారు. ఈ నెల 20న జెడ్పిటిసి చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఉంటుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లూ అధికారులు చేశారు. జెడ్పి చైర్మన్ పదవికి భీమిలి జెడ్పిటిసి గాడు అలివేణి, పెందుర్తి జెడ్పిటిసి సుఖవాసి అజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో గాడి అలివేణి భర్త గాడు అప్పలనాయుడు గతంలో రెండు పర్యాయాలు మండల పరిషత్ అధ్యక్షునిగా, ఒక పర్యాయం జెడ్పిటిసిగా పనిచేశారు. భీమిలి జెడ్పిటిసి స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో జెడ్పిటిసిగా ఆయనకు పోటీ చేసే అవకాశం లేకపోయింది. దీంతో ఆయన సతీమణి అలివేణి పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయ వారసత్వం నేపథ్యంలో జెడ్పి చైర్మన్ పదవి అలివేణికి దక్కే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. అదే సందర్భంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికైన సుఖవాసి అజయ్ జెడ్పి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈయనకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మద్దతుగా నిలిచారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అల్లూరి జిల్లా మినహా మిగిలిన 27 జిల్లా పరిషత్తులు కూటమి పార్టీలు గెలుపొందాయి. 27 జిల్లా పరిషత్తులలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలకు పరిషత్ చైర్మన్ స్థానాలు ఎవరికి ఎన్ని వస్తాయి, వాటిలో విశాఖపట్నం జిల్లా పరిషత్ ఏ పార్టీ ఖాతాలోకి వెళుతుంది అనేది చూడాల్సి ఉంది. విశాఖ జిల్లాలో బిజెపి జడ్పిటిసి లేనందున, ఆనందపురం నుంచి నెగ్గిన ఏకైక జనసేన అభ్యర్థి ఎన్ని శ్రీనివాసరావుకు కూటమి పార్టీల అవకాశం మేరకు జెడ్పి చైర్మన్ లభించినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.
విశాఖ జెడ్పి చైర్మన్ పదవికి ఇద్దరు పోటీ
17 నవంబర్, 2026
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 07:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)