విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేందుకు దక్షిణ కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంఘం (ఎస్సిఒఆర్డబ్ల్యూఆర్డబ్ల్యూఒ) విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐఐటి-జెఇఇ, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన సుమారు 105 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించి, ధ్రువపత్రాలతో పాటు నగదు స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా, సెప్టెంబర్ 2026లో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను కూడా ఈ సందర్భంగా అభినందించారు. వారికి ధ్రువపత్రాలతో పాటు నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వివిధ రంగాల్లో వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సిఒఆర్డబ్ల్యూఆర్డబ్ల్యూఒ అధ్యక్షురాలు జ్యోత్స్నా బోహ్రా, ఉపాధ్యక్షులు గాయత్రి సంతారం, కె. సుహాసిని, కార్యదర్శి నికితాశర్మ, కోశాధికారి నిహారిక పాల్గొని విద్యార్థులకు అవార్డులు, స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థులు విద్యారంగంలో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.








కామెంట్లు (0)