గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నెలలు నిండకుండా పుట్టిన శిశువులను సరైన వైద్యంతో కాపాడుకోవచ్చు

16 నవంబర్, 2026

మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే వేడుకలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే వేడుకలు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ: నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు సరైన సమయంలో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని నియోనాటాలజిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ తెలిపారు. ప్రపంచ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన వేడుకలకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సాయి సునీల్ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 కుటుంబాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.5 కోట్ల మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారని తెలిపారు. 37 వారాల కంటే ముందుగా పుట్టిన శిశువులను ప్రీమెచ్యూర్ బేబీస్‌గా, 28 వారాల లోపు జన్మించిన వారిని ఎక్స్‌ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీస్‌గా పరిగణిస్తారని వివరించారు. ఇలాంటి శిశువుల్లో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, శ్వాసకోశ సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, న్యూరో డెవలప్‌మెంట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వీరికి పుట్టిన వెంటనే ప్రత్యేక వైద్య సంరక్షణతోపాటు తల్లిపాలు అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి ఎన్‌ఐసీయూలో ఇంక్యుబేటర్లు, వెంటిలేటర్లు, ఫీడింగ్ ట్యూబ్స్ ద్వారా చికిత్స అందిస్తారని చెప్పారు.

తాను ఇప్పటివరకు సుమారు 9 వేల మంది ప్రీమెచ్యూర్ శిశువులకు వైద్య సేవలు అందించానని, సరైన సమయంలో సరైన ఆసుపత్రికి చేరుకుంటే ఇలాంటి శిశువులను కూడా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రీమెచ్యూర్ ప్రసవం జరిగే అవకాశం ఉన్న గర్భిణులు ముందుగానే అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు గరుడ రామ, విద్యారమ, గీతవందన, రాధిక, కేటీవీ లక్ష్మణ్, విజయ్, మౌనిక, స్రవంతి, ప్రియాంక, భూలక్ష్మి, అనితా త్రిపాఠి, రామాదేవి, సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు, వారి కుటుంబ సభ్యులను ఆకట్టుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్